tdp
Home » APలో TDP-జనసేనతో BJP కలిసేనా?

APలో TDP-జనసేనతో BJP కలిసేనా?

by admin
0 comment

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కలిసి పనిచేస్తున్న టిడీపీ, జనసేనలతో బీజేపీ కలిసివచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. మూడు పార్టీలు కలిసి జగన్ పై సమరం చేయడానికి సిద్ధపడేలా కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు విశిష్ట అతిధిగా పవన్ కళ్యాణ్ కు పిలుపు వచ్చింది. మోదీ, పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు. 2014 ఎన్నికల తర్వాత మోదీ, పవన్ కళ్యాణ్ ఇరువురు తొమ్మిదేళ్ళ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్నారు. వీరిద్దరు ఒకే వేదికపై కనపడటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారే వాతావరణం కనిపిస్తుంది.

2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం, బీజేపీలు కలిసి పోటీచేశాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీచేయకుండానే మద్దతు ప్రకటించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం కల్గిన చంద్రబాబు, అలాగే దేశానికి సమర్ధవంతమైన నాయకుడు మోడీ అవసరం ఎంతో వుందని ఎన్నికల ప్రచారంలో తన వాణిని వినిపించారు. జనసేన శ్రేణులు టీడీపీ, బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని సూచించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనా బాధ్యతలు చేపట్టారు. తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ టీడీపీ, బీజేపీలను వీడారు. 2019 జరిగిన ఎన్నికల్లో ఉభయ కమ్యూనిష్టులతో పాటు బీఎస్పీలతో కలిసి ఆయన ఎన్నికల్లో పోటీచేశారు. అయితే టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని పరాజయం పాలయ్యింది. టీడీపీని కాదని ఎన్నికల్లో పోటీచేసిన జనసేన సైతం ఒకే ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. తాను పోటీచేసిన రెండు చోట్ల పవన్ పరాజయం పాలయ్యారు.

కొన్ని నెలల క్రితం విశాఖపట్టణంలో జనసేన తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలులేదంటూ వైసీపీ సర్కార్ ఆంక్షలు విధించింది. దీంతో పవన్ హోటల్ గదికే పరిమితమై సర్కార్ ను దుమ్మెత్తిపోశారు. ఇదే అదనుగా భావించిన చంద్రబాబు మరుసటి రోజే విజయవాడ నోవాటెల్‌లో పవన్ కళ్యాణ్ ను కలిసి సంఘీబావం ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మైత్రి బంధం తిరిగి చిగురించేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. కుప్పంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకొని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్ళి కలిసి బాసటగా నిలిచారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మైత్రి బంధం బలపడింది. ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులు ఎలా వున్నా వైసీపీ అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు కలిసి పనిచేస్తామని చంద్రబాబు, పవన్ లు స్పష్టం చేశారు. కానీ ఇరు పార్టీల శ్రేణులు ఎక్కడా కలిసి కార్యక్రమాలను చేపట్టలేదు. విడివిడిగానే టీడీపీ, జనసేనలు వైసీపీపై ధ్వజమెత్తారు.

పవన్ వారాహి యాత్రపేరుతో , టీడీపీ లోకేష్ నాయకత్వంలో యువగళం, భవిష్యత్ కు భరోసా బాబు అంటూ వైసిపి పాలనను ఎండగట్టారు. ఇందులో భాగంగానే నంద్యాలలో భవిష్యత్ కు భరోసా కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో ఏపీస్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సీఐడి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రోడ్డు మార్గం ద్వారా బాబును పోలీసులు తాడేపల్లిలోని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. బాబును అరెస్ట్ చేసి తీసుకువచ్చే సమయంలో టీడీపీ శ్రేణులు రోడ్డు పొడవునా నిరసనలు తెలిపారు. చంద్రబాబును విచారణచేసిన పోలీసులు ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బాబుకు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేనాని ఖండించారు. రాజకీయ కక్ష్యతో చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆరోపించారు. వెంటనే జైలుకు వెళ్ళి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.

బాబు ములాఖత్ అనంతరం జైలు బయటనే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయని పవన్ స్పష్టం చేశారు. బీజేపీ కలుస్తుందో లేదో వారే నిర్ణయించుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ మాత్రం ఎటువంటి కామెంట్లు చేయకుండా మిన్నకుంది. మేము ఇప్పటికీ జనసేనతో పొత్తులో వున్నామంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురందేశ్వరి పేర్కొన్నారు. కానీ టీడీపీతో దోస్తీ గురించి మాత్రం బీజేపీ పెదవి విప్పలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ప్రచార సభలో అతిధిగా పవన్ పాల్గొంటడంతో పాటు కలిసి ఎన్నికల్లో పోటీచేస్తుండటంతో.. ఏపీలో కూడా టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు వుంటుందన్న ప్రచారం జరుగుతోంది. జనసేన, బీజేపీ పొత్తు తెలంగాణ ఎన్నికల వరకే పరిమితమవుతుందా లేదా ఏపీ ఎన్నికల్లో సైతం మూడు పార్టీల మైత్రి కొనసాగుతుందో వేచి చూడాల్సిందే!

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links