ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక.. ఈనెల 13న హైదరాబాద్లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్, భాజపా నేతలు ఆందోళనలకు దిగారు. గ్రూప్స్ పరీక్షల వాయిదా కారణంగా మానసిక ఒత్తిడితో ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. దీంతో ప్రవల్లిక ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. శివరామ్ రాథోడ్ వ్యవహారం వెలుగుచూసింది. మృతురాలి సెల్ఫోన్ డేటాను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఆమెతో శివరాం చేసిన వాట్సప్ సందేశాలను గుర్తించారు. దీంతో అతడిపై 417, 420, 306 వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, పరారీలో ఉన్న శివరామ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అయితే శివరామ్ రిమాండ్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, దర్యాప్తు జరుగుతున్నందున రిమాండ్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
505
previous post