జీవితాంతం కలిసి ఉండాలని మూడేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ భార్య సమీప బంధువుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో స్వయంగా భర్తే ప్రియుడితో భార్యకు వివాహం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని సోన్‌పూర్ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే.. మాధవ ప్రధాన్ మూడేళ్ల క్రితం అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లిని వివాహమాడారు. ఇటీవల జిల్లి దూరపు బంధువైన పరమేశ్వర ప్రధాన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. గురువారం అతనితో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీనిపై మాధవ ప్రధాన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అనంతరం పోలీసులు గాలించి వారిద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. జిల్లిని ఠాణా అధికారి ప్రశ్నించగా పరమేశ్వర్ ప్రధాన్‌తో ఉంటానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో విషయం మాధవ ప్రధాన్‌కు వివరించారు. మాధవ అంగీకారంతో ఆయన సమక్షంలోనే శనివారం రాత్రి వారిద్దరికి ఠాణాలో వివాహం చేశారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.