వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీస్కోర్ దిశగా వెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 288 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 87 పరుగులతో అజేయంగా నిలవగా, అతనికి తోడుగా జడేజా (36) క్రీజులో నిలిచాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ (80), యశస్వి జైశ్వాల్ (57) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించారు. యువ ఓపెనర్ జైశ్వాల్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ సాధికారికంగా ఆడటంతో తొలి సెషన్లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
కానీ రెండో సెషన్లో విండీస్ బౌలర్లు పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే వరుసగా నాలుగు వికెట్లు తీశారు. గిల్ (10), రహానె (8) నిరాశపరిచారు. కానీ తన కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లి, జడేజాతో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తిరిగి రేసులో నిలిచింది. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్, గాబ్రియల్, రోచ్, హోలర్డ్ తలో వికెట్ తీశారు.
తొలి రోజు ఆటలో రికార్డులు
వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా పర్యాటకజట్టు ఓపెనింగ్ బ్యాటర్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్-జైశ్వాల్ జోడీ మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు బాయ్‌కాట్-డెన్నిస్ అమిస్ (1974లో) 229 పరుగులు, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆర్థుర్-మెక్‌డొనాల్డ్ (1955లో) 191 పరుగులు జోడించారు.
నాలుగో స్థానంలో అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాటర్ విరాట్ (7,097). ఈ జాబితాలో సచిన్ (13,492 పరుగులు), మహేల జయవర్థనె (9,509), కలిస్ (9,033), బ్రియాన్ లారా (7,535) కోహ్లి ముందు ఉన్నారు.