నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్, తదితరులు..
రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
సంగీతం: కళ్యాణ్ నాయక్
డీవోపీ: శ్యామ్ దూపాటి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
రన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు
సెన్సార్: UA
రిలీజ్ డేట్: మే 26
రేటింగ్: 2.5/5
ఈమధ్యకాలంలో ప్రమోషన్స్ తో అదరగొట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది మేమ్ ఫేమస్ మూవీ మాత్రమే. చాయ్ బిస్కెట్ నిర్మాతలు ప్రచారంలో తోపులు. తమ ప్రతి సినిమాకు ప్రచారం విషయంలో వీళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంతో వీళ్ల వ్యూహాలు బాగుంటాయి. మేమ్ ఫేమస్ సినిమాకు కూడా వీళ్లు అదే పనిచేశారు. విజయ్ దేవరకొండ, నాగచైతన్య, అడివి శేష్ లాంటి హీరోలను ప్రచారంలో భాగం చేశారు. ఇక విడుదలకు సరిగ్గా కొన్ని గంటల ముందు ఏకంగా మహేష్ బాబుతో ట్వీట్ పడేలా చేశారు. ఇలా సినిమాకు ఎంత ప్రచారం చేయాలో, అంతకంటే, చాలా ఎక్కువగానే ప్రమోట్ చేశారు. ఓ చిన్న సినిమాకు ఇలాంటి ప్రచారం అవసరమే. మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుంది. అంతవరకు మాత్రమే ప్రచారంతో పని. ఆ తర్వాత పనిచేయాల్సింది కంటెంట్ మాత్రమే. మేమ్ ఫేమస్ విషయంలో ఇదే జరిగింది.
ఇంకాస్త వెనక్కు వెళ్దాం. ఇదే నిర్మాతలు గతంలో రైటర్ పద్మభూషణ్ అనే సినిమాను రిలీజ్ చేశారు. ఆ సినిమాకు కూడా ఇదే స్థాయిలో ప్రచారం చేశారు. థియేటర్లకు జనాల్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఒక్కసారి థియేటర్ కు వచ్చిన ఆడియన్స్, కంటెంట్ కు కనెక్ట్ అయ్యారు. అలా ఆ సినిమా సక్సెస్ అయింది. కానీ అంతలా కనెక్ట్ అయ్యే కంటెంట్ మేమ్ ఫేమస్ లో కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే, రొటీన్ కంటెంట్ తో తెరకెక్కింది ఈ సినిమా.
ఇది ముగ్గురు స్నేహితుల కథ. ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్న బండనర్సంపల్లి అనే గ్రామంలో జీవిస్తుంటారు. వీళ్లకు లక్ష్యం అంటూ ఏమీ ఉండదు. వీళ్లలో ఇద్దరు ప్రేమలో ఉంటారు. కానీ వారి ప్రేమను గెలుచుకోవడానికి, మంచి లైఫ్ లీడ్ చేయడానికి వాళ్లకు డబ్బులు కావాలి. కాబట్టి, వారు ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకుంటారు. అలా ఫేమస్ అవ్వడం కోసం టెంట్ హౌజ్ పెడతారు. అది కాస్తా కాలిపోతుంది. ఆ తర్వాత ఫేమస్ యూట్యూబ్ ఛానెల్ పెడతారు. వాళ్ల ప్రయత్నాలు ఫలించాయా లేదా? వాళ్లు ఫేమస్ అయ్యారా లేదా అనేది సినిమా స్టోరీ.
ఇలాంటి కథలు ప్రేక్షకులకు కొత్తకాదు, చాలానే చూశారు. పైగా ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ కూడా కొత్తకాదు. బలగం సినిమా మొత్తం ఇదే కదా. కాబట్టి మేమ్ ఫేమస్ సినిమా నిజంగానే ఫేమస్ అవ్వాలంటే నెరేషన్ తో ఆకట్టుకోవాలి. అది ఈ సినిమాలో లోపించింది. సినిమా రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. మొదటి 30 నిమిషాలు సాదాసీదాగానే నడుస్తుంది. అక్కడ్నుంచి కాస్త ఊపందుకొని, మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ నుంచి సినిమా ఊపందుకుంటుందని భావిస్తే, అక్కడ కూడా నెరేషన్ లో మిస్టేక్స్ కనిపిస్తాయి.
సెకండాఫ్ లో ల్యాగ్ ఇంకా ఎక్కువైంది. స్క్రిప్ట్ లో కొత్తదనం లేకపోవడం, లవ్ ట్రాక్ సరిగ్గా పండకపోవడం ప్రధానమైన ఇబ్బందలు. ఉన్నంతలో కామెడీ సీన్లు ఈ సినిమాను నిలబెట్టాయి. అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు ఊరట. అయితే సెకండాఫ్ లో ఇది కూడా శృతిమించింది. కామెడీ కూడా వెగటుపుట్టింది. దీనికితోడు సింక్ సౌండ్ లో చేయడం కలిసిరాలేదు. మంచి రైటింగ్ టీమ్ తో కూర్చొని ఉంటే, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది.
ఉన్నంతలో ఈ సినిమాలో మెప్పించిన అంశం ఏదైనా ఉందంటే అది సుమంత్ ప్రభాస్ మాత్రమే. తన పెర్ఫార్మెన్స్ తో సుమంత్ ప్రభాస్ ఆకట్టుకున్నాడు. రైటర్/డైరక్టర్ అవుదామని ఇండస్ట్రీకొచ్చిన ఈ కుర్రాడు, యాక్టింగ్ తో ఆకట్టుకోవడం విచిత్రమే. మిగిలిన పాత్రలన్నీ తమ పరిథి మేరకు నటించాయి. టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోడానికేం లేదు. కల్యాణ్ నాయక్ అందించిన 2 పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగాలేదు. సినిమా నుంచి దాదాపు 15-20 నిమిషాల రన్ టైమ్ ను నిర్మోహమాటంగా కట్ చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, ఈ కథ, ఈ కాస్టింగ్ తో అంతకుమించి ఖర్చుచేయడం కూడా రిస్క్ అవుతుంది.
ఓవరాల్ గా మేమ్ ఫేమస్ సినిమా ఓ షార్ట్ ఫిలిం చూస్తున్న అనుభూతిని ఇస్తుంది తప్ప, సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇవ్వదు. టెక్నికల్ గా, క్రియేటివ్ కోణంలో చూసుకుంటే ఇది ఫీచర్ ఫిలింస్థాయిలో లేదు. పైగా ఇది పూర్తిగా తెలంగాణ యూత్ ను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా కావడంతో.. కొన్ని డైలాగ్స్, కామెడీ సీన్స్ వాళ్లకు మాత్రమే నచ్చుతాయి. యూత్ కు నచ్చే అంశాలు కొన్ని ఉన్నప్పటికీ, ఓవరాల్ గా అందరూ మెచ్చే సినిమా మాత్రం కాదిది.