కన్నడ కదనంలో చేయి గుర్తుదే పైచేయిగా కనిపిస్తోంది. కౌంటింగ్ మొదలైన తొలి నిమిషం నుంచీ కర్ణాటక రాష్ట్రం హస్తానికే హస్తగతం కానుందనే సంకేతాలు మొదలయ్యాయి. స్వంతంగానే మ్యాజిక్ ఫిగర్ ని, కన్నడ కాంగ్రెస్ వశం చేసుకుంటుందనే విశ్లేషణలు ఉపందుకున్నాయి. ఇంతకీ, కాంగ్రెస్ గెలుపుకి దోహదం చేసిన ముఖ్యమైన కారణాలు ఏంటి? ఓసారి పరిశీలిద్దాం…
నిజానికి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని చాలా రోజుల ముందు నుంచే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుక్కారణం, బీజేపీ కన్నడ నేతల అవినీతి, కమీషన్లు తీసుకునే సంస్కృతేనని టాక్ వినిపించింది. అయితే, బీజేపీ అవినీతి, అసమర్థత మాత్రమే కాంగ్రెస్ గెలుపుకి బాటలు వేయలేదు. ఇంకా పలు కారణాలు ఉన్నాయి.
నిత్యావసరాల ధరలు పెరుగుదల
- ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవటం సామాన్య కన్నడిగులపై తీవ్ర ప్రభావాన్నే చూపిందంటున్నారు.
- గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కామన్ కన్నడ ఓటర్ ను కాంగ్రెస్ వైపు మొగ్గేలా చేసిందట.
నిరుద్యోగ భృతి
- దేశంలో అతి తక్కువ నిరుద్యోగ యువత ఉన్నది కర్ణాటకలోనే.
- కేవలం 2 శాతానికి అటుఇటుగా మాత్రమే అన్ ఎంప్లాయిమెంట్ ఉంది కన్నడనాట.
- అయినా కూడా కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామి జనాన్ని ఆకర్షించగలిగింది.
రైతుల అసంతృప్తి
వ్యవసాయ రంగంలోనూ బీజేపీ రైతుల నుంచీ వ్యతిరేకత ఎదుర్కున్నట్టు తెలుస్తోంది. కమలం పార్టీ కన్నడ నేతలు తమకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదని రైతాంగం భావించటం అనేక ప్రాంతాల్లో కాషాయదళం విజయావకాశాలకి గండి కొట్టింది.
రెబెల్స్ గోల
- సామాజికమైన సమస్యలే కాక బీజేపీకి అంతర్గతంగా ఏర్పడిన తిరుగుబాట్లు కూడా తలనొప్పిగా మారాయి.
- రెబెల్స్ పెద్ద ఎత్తున బరిలోకి దిగి చాలా చోట్ల కాంగ్రెస్ గెలుపుకి పరోక్షంగా సహకరించారు.
- కాంగ్రెస్ కు కూడా రెబెల్స్ సెగ గట్టిగానే తాకింది.
కాంగ్రెస్ సంక్షేమ మంత్రం
- కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒకింత హద్దులు ఎరుగని ఆకర్షణీయమైన హామీలు ఓటర్లలో ఊపు తీసుకొచ్చాయి.
- గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి లాంటి లెక్కలేనన్ని పథకాలు కన్నడ హస్తం పార్టీ ప్రకటించింది. 3. దిల్లీలో కేజ్రీవాల్ ఫార్ములా ఇక్కడ కాంగ్రెస్ అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సర్వీసు హామీని కూడా అందించింది.
- ఇటువంటి కాంగ్రెస్ మార్కు హామీల వర్షం ఓట్ల వర్షం కురిపించగలిగిందని చెప్పాలి.
క్లైమాక్స్ లో బజ్రంగీ బళీ ట్విస్ట్
- అంతా సాఫీగా సాగుతుండగా కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో బజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామనటం ఒకింత కలకలమే రేపింది.
- చేయి గుర్తు పార్టీ చేజేతులా అధికారం కోల్పోతోందని కొందరు అంచనా వేశారు.
- అటువంటిదేం జరగదని తాజా ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.
- డీకే శివకుమార్, సిద్ధరామయ్య జోడీ కంఫర్టబుల్ గా మ్యాజిక్ ఫిగర్ దాటేలాగా మ్యాజిక్ చేసినట్టే కనిపిస్తోంది. అయితే, హంగ్ అవకాశాలు కూడా ప్రస్తుతానికి లేకపోలేదు.