హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
వాగులు పొంగుతున్న నేపథ్యంలో మరోవైపు హైద్రాబాద్ నుండి విశాఖ వెళ్ళే వాహనాల దారి మళ్లించారు. నార్కెట్ పల్లి, మిర్యాలగూడ ,దాచేపల్లి ,పిడుగురాళ్ళ ,గుంటూరు ,విజయవాడ ,ఏలూరు ,రాజమండ్రి మీదుగా విశాఖ వెళ్లాలని సూచించారు. ఇంబ్రహీంపట్నం ,కీసర వద్ద ట్రాఫిక్ మల్లింపులు కొనసాగుతున్నాయి.
TSRTC ప్రయాణికులకు గమనిక
వర్షాల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్‌ఆర్‌టీసీ రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని వెల్లడించారు. మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని అన్నారు.