సింగరేణి సంస్థ కొందరు దళారులకు అడ్డాగా మారింది. అటు ఉద్యోగాల నోటిఫికేషన్ నుంచి ఇటు బదిలీలు, పదోన్నతుల వరకు పైసా లేనిదే పని సాగదు అన్నట్టుగా మారింది. ఇదే అదనుగా కొంతమంది సింగరేణి కేంద్రంగా అమాయకులను మోసగించే పనిలో పడి లక్షలు దండుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏడాది కాలంగా పోలీస్‌లకు చిక్కకుండా పరారీలో ఉన్న ఓ బ్లప్ మాస్టర్ సంగతి మాత్రం ఇందుకు బిన్నం. కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా ఇతను దోచుకునేందుకు అటు ప్రభుత్వ పైరవీలతోపాటు సింగరేణి పైరవీలకు తెరలేపాడు. పని చేసుడు దేవుడెరుగు అమాయకుల నుంచి మాత్రం ముందుగానే లక్షల్లో వసూళ్లు చేశాడు. ఏ పనినైనా ఇట్టే చేయగలనని చెబుతూ కోట్లు కుమ్మేసాడు. చివరకు సింగరేణిలో క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.20 కోట్ల మేరకు వసూళ్లు చేశాడు. తీరా ఉద్యోగాలు రాకపోవడంతో బాదితులు కాస్తా పోలీసులను ఆశ్రయించారు. అయితే గత ఏడాది మే నెలలో ఇతని నిర్వాహకంపై తొలి పిర్యాదు అందగా ఆ తర్వాత పదుల సంఖ్యలో బాదితులు వచ్చి పిర్యాదు చేయడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు నిందితుడు మాత్రం పరారీలో ఉండటం గమనార్హం.
హత్య కేసు నుంచి మొదలైన బ్లప్ మాస్టర్ జీవితం..?
వరంగల్ జిల్లా రంగశాయిపేటకు చెందిన హరికిషన్ దాస్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్‌కు చెందిన ఓ గొడవల్లో చిన్నారుడిని కిడ్నాప్ చేసి కాల్వలో పడేసినట్లు ఇతనిపై పిర్యాదు నమోదైంది. ఆ కేసులో ఎలాగోలా బయటపడ్డ దాసు ఆ తర్వాత ప్రభుత్వ పైరవీలపై దృష్టి సారించాడు. సెక్రటరీయేట్ కేంద్రంగా కొందరి సహకారంతో ఆరోగ్యశాఖతోపాటు పలు శాఖలో పనులు చేయిస్తానని నిరుద్యోగుల దగ్గర నుంచి వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది కాస్తా మూడు పువ్వులు ఆరుకాయలుగా మారడంతో సింగరేణిలో ఇటీవల విడుదలైన క్లరికల్ నోటిఫికేషన్ ద్వారా పైసలు కొల్లగొట్టేందుకు ప్లాన్ గీశాడు.
ఏజెంట్ల ద్వారా భారీగా వసూళ్లు..
2015లో సింగరేణిలో జరిగిన క్లరికల్ నోటిఫికేషన్‌లో అనేక అవతవకలు జరిగాయని ఆరోపణలు రావడం, పైసలు పెట్టిన వారికి కొలువులు వచ్చాయని ప్రచారం జరగడంతో దీనిని ఎలాగైనా వాడుకోవాలని స్కెచ్ గీశాడు దాస్. అనుకున్నదే తడువుగా సింగరేణి వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని వారికి అప్పటి చీఫ్ సెక్రటరీ, సీఎండీ లెటర్లు చూపించి క్లరికల్ పోస్టులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆశపడ్డ అనేక మంది ఏజెంట్ల ద్వారా భారీ ఎత్తున అతనికి డబ్బులు చెల్లించుకున్నారు. తీరా పలితాలు వచ్చాక ఉద్యోగం రాకపోవడంతో లబోదిబోమనాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అతని గత చరిత్ర చూసిన కొంత మంది పిర్యాదు చేసేందుకు నిరాకరించగా 2023 మే 5న అతనిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రారంభంలో కేవలం రూ.21 లక్షలకు సంబందించిన పిర్యాదు మాత్రమే రాగా ఆ తర్వాత పదుల సంఖ్యలో వచ్చిన బాదితులు ఇతనిపై పిర్యాదు చేశారు. దీంతో ఇప్పటి వరకు సుమారు రూ.20 కోట్ల మేరకు ఇతను ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసినట్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే చాలా మంది బాదితులు అతను దొరికితే తమకు డబ్బులు వస్తాయని, కొంత మంది అతని నేర చరిత్ర తెలుసుకుని జాగ్రత్తగా ఉందామనుకుని పిర్యాదు చేయడం లేదని తెలుస్తోంది.
ఎనిమిది నెలలుగా తప్పించుకు తిరుగుతున్న బ్లప్ మాస్టర్..
చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో హరికిషన్ దాస్‌పై కేసు నమోదై ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నిందితుడు దొరక్కక పోవడం గమనార్హం. ఎక్కడికక్కడ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంటున్న బ్లప్ మాస్టర్ పోలీసుల కన్నుకప్పి తప్పించుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఈ బ్లప్ మాస్టర్‌ను పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు ఎస్‌హెచ్‌వోలు ఈ కేసు విషయంపై విచారణ చేసినప్పటికీ నిందితుడు మాత్రం దొరక్కలేదు. అయితే బ్లప్ మాస్టర్ దొరక్కకపోవడం, అతను చెలాయించిన అక్రమ మార్గాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.70 కోట్ల మేరకు వసూలు చేసిన బ్లప్ మాస్టర్ చేసిన అక్రమాలు, ఇప్పటి వరకు అతను దొరకక్కపోవడానికి కారణాలపై మరిన్ని కథనాలు ‘న్యూస్ 360’ తెలుగు చానల్ మీకు అందించనుంది.
– కోలకాని నవీన్‌కుమార్,
సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 360