RAIN UPDATES: ప్రమాదంలో ప్రాజెక్ట్‌.. జలదిగ్బంధంలో మోరంచపల్లి

రాష్ట్రంలో వర్షాల ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల నేపథ్యంలో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్‌

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లో మరోసారి భారీగా వరదనీరు చేరింది. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 14 వరద గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు మొత్తంగా 18 వరద గేట్లు ఉండగా.. అందులో నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా ఇంకా మొరాయిస్తున్నాయి.

జలదిగ్బంధంలో మోరంచపల్లి

జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో ఉండిపోయింది. మోరంచ వాగు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లలోకి 4 నుంచి 5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇంటి స్లాబ్‌ల పైకి ఎక్కారు. మరికొంతమంది సమీపంలోని చెట్లపైన తలదాచుకున్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అప్రమత్తం చేశారు.

బయటపడిన పర్యాటకులు

అభయారణ్యంలో చిక్కుకున్న పర్యాటకులను ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షితంగా కాపాడాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు అభయారణ్యంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మార్గం మధ్యలోని మామిడివాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో సుమారు 134 మంది పర్యాటకులు బుధవారం అటవి ప్రాంతంలోనే చిక్కుకున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..