తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. వరద నీటి చేరికతో నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి, అసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వగా, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చెప్పారు. కరీంనగర్, అదిలాబాద్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరుగులు పెడుతోంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు 41.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం సాయంత్రం 3.30 గంటలకు 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అంతేగాక ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 9,980 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది. ఇది మరింత పెరగనుంది.
ఇక, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. తాడిచర్ల ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాటారం నుంచి మేడారానికి వెళ్లే రహదారి మధ్యలో కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నదుల్లో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.