ఎలాంటి ప్రాణనష్టం జరగొద్దు: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రధానంగా ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలన్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సంబంధించి పరిస్థితిని సీఎం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వారిని ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేశారు.

తక్షణ రక్షణ చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌లోని అధికారులతో సీఎస్ సమీక్ష సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎస్ బృందాలు, రక్షణచర్యల కోసం హెలికాప్టర్లు, ఆహారం, వైద్యం, సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టారు. విపత్తుల నిర్వహణ శాఖకు, అగ్నిమాపక శాఖకు, పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. స్టేట్ లెవల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు
వర్షాల నేపథ్యంలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో, వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని చీఫ్‌ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇన్ ఫ్లో ను ముందస్తు అంచనా వేసి, గేట్లు ఎత్తివేస్తూ, వరద నీటిని కిందికి వదలాలని చెప్పారు. ఈ మేరకు ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్లు చేసి, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని సీఎం కోరారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ మంత్రులకు ఫోన్లలో ఆదేశించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..