భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆటలో మహ్మద్ సిరాజ్ (5/60) బంతితో చెలరేగితో.. రోహిత్ శర్మ (57), ఇషాన్ కిషాన్ (52*) ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఒక్కసారిగా ఆఖరి టెస్టు ఉత్కంఠగా మారింది. విజయం సాధించాలంటే మిగిలిన చివరి రోజు ఆటలో టీమిండియా 8 వికెట్లు పడగొట్టాలి. కాగా, ఆదివారం ఆట ముగిసేసరికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ఆ జట్టు లక్ష్యానికి ఇంకా 289 పరుగుల దూరంలో నిలిచింది.
ఓవర్‌నైట్ స్కోరు 229/5తో ఆటను ఆరంభించిన వెస్టిండీస్ 255 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ ధాటికి తమ చివరి 5 వికెట్లు 7.4 ఓవర్లలోనే కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా టీ20 తరహాలో ఆడింది. కెప్టెన్ రోహిత్ అర్ధశతకంతో సత్తాచాటాడు. యశస్వి జైశ్వాల్ (38)తో కలిసి 12 ఓవర్లలోనే 98 పరుగులు చేశాడు. గిల్ 29 స్కోరు వద్ద వెనుదిరిగాడు.
నాలుగో స్థానంలో వచ్చిన ఇషాన్ కిషాన్ 33 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. తన టెస్టు కెరీర్‌లో తొలి హాఫ్‌సెంచరీ సాధించాడు. 181/2 పరుగుల స్కోరు వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల టార్గెట్ ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 76 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. చంద్రపాల్ (24), బ్లాక్‌వుడ్ (20) క్రీజులో ఉన్నారు.