వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. గురువారం విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో (WIvIND) టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు భారత బౌలర్ల ధాటికి 23 ఓవర్లలోనే 114 పరుగులు చేసింది. కుల్దీప్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన రోహిత్ సేన 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యం ఛేదించింది. ఇషాన్ కిషాన్ (52) అర్ధశతకం చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో 114 పరుగులకే కుప్పకూలింది. అయితే పేస్, స్పిన్‌కు సమానంగా అనుకూలించిన ఈ పిచ్‌పై భారత స్పిన్నర్లు అదరగొట్టారు. కుల్దీప్ (4/6), జడేజా (3/37) బంతిని గిరగిరా తిప్పుతూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. పేసర్లు ముకేష్, శార్దూల్, హార్దిక్ తలో వికెట్ తీశారు. విండీస్ జట్టులో కెప్టెన్హొప్ (43) టాప్ స్కోరర్.
స్వల్ప టార్గెట్ కావడంతో ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా మారింది. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని భావించడంతో రోహిత్ ఏడో స్థానంలో రాగా, విరాట్ కోహ్లీ అసలు బ్యాటింగ్‌కు రాలేదు. ఓపెనర్లుగా గిల్, కిషాన్ వచ్చారు. అయితే గిల్ 7 పరుగులకే వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ (19), హార్దిక్ పాండ్య (5)తో కలిసి ఇషాన్ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అర్ధశతకం అందుకున్న అతడు మొతి చేతిలో ఔటయ్యాడు. అనంతరం జడేజా (16)తో కలిసి రోహిత్ (12) జట్టును విజయతీరాలకు చేర్చాడు.