వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. విరాట్ కోహ్లి (121) స్పెషల్ సెంచరీకి, రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్ (56) అర్ధశతకాలు తోడవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 438 భారీ పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు రెండో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్(37), మెకంజీ (14) క్రీజులో ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను ఆరంభించిన కోహ్లి, జడేజా నిలకడగా ఆడారు. తన కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లి సాధికారితతో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతడు స్క్వేర్ డ్రెవ్‌తో సెంచరీ సాధించాడు. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత విదేశీ పిచ్‌లపై టెస్టుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. మరోవైపు అదే ఓవర్‌లో జడేజా కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ తర్వాత కోహ్లి సింగిల్‌కు ప్రయత్నించి రనౌటయ్యాడు. అనంతరం జడేజా కూడా వెనుదిరిగాడు.
ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్.. యువ వికెట్‌కీపర్ ఇషాన్ కిషాన్ (25), ఉనద్కత్ (7)తో కలిసి పరుగులు చేయడంతో భారత్ భారీస్కోరు సాధించింది. విండీస్ బౌలర్లలో వారికన్, రోచ్ చెరో మూడు వికెట్ల తీయగా హోల్డర్ రెండు, గాబ్రియల్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ఆటగాళ్లు బ్రాత్‌వైట్, చంద్రపాల్ ఆచితూచి ఆడారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 71 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కానీ జడేజా చంద్రపాల్‌ను ఔట్ చేయడంతో వారి భాగస్వామ్యానికి తెరపడింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆతిథ్యజట్టు 352 పరుగుల వెనుకంజలో ఉంది.