టీమిండియా ఆటగాళ్లను తీవ్రంగా విమర్శించిన దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ వ్యాఖ్యలపై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. భారత జట్టులో ఎవరికీ అహంకారం లేదని అన్నాడు. తమ అభిప్రాయాలు చెప్పడానికి మాజీ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉందని, అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్లవని జడ్డూ బదులిచ్చాడు.
ఓ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కపిల్‌దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ”టీమిండియా క్రికెటర్లు తమకే అన్నీ తెలుసని ఫీలవుతారు. ఎవరి సలహాలూ తీసుకోరు. ఒక్కసారిగా డబ్బులొస్తే ఇలాంటి అహంకారమే వస్తుంది. ఇప్పుడు క్రికెటర్లకు సీనియర్ల గైడెన్స్ అవసరం. లెజెండరీ సునీల్ గావస్కర్ నుంచి సలహాలు తీసుకోవడానికి ఇబ్బందేంటో తెలియడం లేదు. ఐపీఎల్ గొప్పదే. కానీ అది నాశనం చేయగలదు. ఆటగాళ్లు చిన్న చిన్న గాయాలైతే ఐపీఎల్ ఆడుతున్నారు కానీ టీమిండియాకు ఆడటం లేదు. వెంటనే విరామం తీసుకుంటున్నారు. నేనీ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నా” అని కపిల్ అన్నాడు.
దీనిపై జడేజా తాజాగా స్పందించాడు. ”ఆయన ఏం అన్నారో నాకు తెలియదు. ఇలాంటి విషయాల గురించి సామాజిక మాధ్యమాల్లో వెతకను. అయితే ఎవరి అభిప్రాయం వాళ్లకి ఉంటుంది. మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు పంచుకునే స్వేచ్ఛ ఉంది. కానీ మా జట్టులో ఎవరికీ అహంకారం లేదు. జట్టులో ప్రతిఒక్కరు క్రికెట్ కోసమే శ్రమిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. సులువుగా ఏదీ సాధించలేదు. మా ఉత్తమ ప్రదర్శన 100 శాతం ఇస్తున్నాం. అయితే మ్యాచ్ ఓడిపోయిన సందర్భాల్లో ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. కానీ మా జట్టు బలంగా ఉంది. భారత్ తరఫున మేం ఆడుతున్నాం. దేశం కోసం గెలవడమే మా లక్ష్యం. వ్యక్తిగత లక్ష్యాలు ఎవరికీ లేవు” అని పేర్కొన్నాడు.