ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు సాధించడమే చాలా అరుదు. కానీ నిరుడు ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో రుతురాజ్ గైక్వాడ్ ఔరా అనిపించాడు. నోబాల్‌నూ సిక్సర్‌గా మలచడంతో అప్పుడు 43 పరుగులు వచ్చాయి. అయితే ఆ రికార్డు కూడా ఇప్పుడు బద్దలైంది. ఒకే ఓవర్‌లో 48 పరుగులతో సరికొత్త ఘనత నమోదైంది.
అఫ్గానిస్థాన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ ఈ రికార్డు అందుకున్నాడు. ఓవర్లో ఏకంగా 48 పరుగులు రావడం విశేషం. కాబుల్ ప్రిమియర్ లీగ్‌లో అబాసిన్ డిఫెండర్స్‌తో మ్యాచ్‌లో షహీన్‌షా హంటర్స్ కెప్టెన్ సెదిఖుల్లా (56 బంతుల్లో 118) చెలరేగిపోయాడు. అమీర్ జజాయ్ వేసిన 19వ ఓవర్లో తొలి బంతి పడకుండానే 12 పరుగులు వచ్చాయి. నోబాల్‌గా వేసిన మొదటి బంతికి సెదిఖుల్లా సిక్స్ కొట్టగా.. అదనపు బంతి వైడ్‌గా పడి బౌండరీ దాటడంతో ఎక్స్‌ట్రాగా మరో 5 పరుగులు లభించాయి. తర్వాతి ఆరు బంతులను సెదిఖుల్లా సిక్సర్లుగా మలిచి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.