లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్ డిప్యూటి నేత గౌరవ్ గొగొయి.. దిగువ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చారు. దీనిపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు. మరోవైపు భారాస ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు.
మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీతో ఎలాగైనా మాట్లాడించాలని విపక్ష కూటమి ‘ఇండియా’ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం బుధవారం ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’ కూటమికి 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. మణిపుర్ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాయి.