నీరు (water) తాగి ఓ మహిళ అనారోగ్యానికి గురైంది. అలా అని ఆమె కలుషితమైన నీరు ఏమి తాగలేదు. మోతాదుకు మించి తాగింది అంతే.. ఆ తర్వాత ఆస్పత్రి పాలైంది. అయితే అధిక నీరు తాగితే అనారోగ్యానికి గురవుతామా అనే సందేహం మీకు కలగొచ్చు. క్లారిటీ కోసం మొత్తం చదివేయండి మరి!!!
’75 హార్డ్’ ఛాలెంజ్ (75 hard fitness challenge) గురించి మనం చాలా సార్లు విని ఉంటాం. ఫిట్‌నెస్ కోసం 75 రోజులు ఓ ప్రణాళికతో జీవించాలి. ఈ ఛాలెంజ్‌లో భాగంగా రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి. 45 నిమిషాల పాటు రోజుకు రెండు సార్లు కసరత్తులు చేయాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు. తప్పనిసరిగా డైట్ పాటించాలి. అంతేగాక ప్రతిరోజు పుస్తకంలో 10 పేజీలు అయినా చదవాలి.
అయితే ‘75 హార్డ్’ ఛాలెంజ్‌లో పాల్గొన్న కెనడా మహిళ మిచెల్ ఫెయిర్ బర్న్ 12 రోజులకే ఆస్పత్రి పాలైంది. టొరొంటోలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఆమె అధిక మొత్తంలో నీళ్లు తాగడంతో అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యులని సంప్రదించింది. పరీక్షలు చేయించుకుంటే సోడియం తక్కువగా ఉన్నట్టు తేలింది. సోడియం లోపం ప్రాణానికి హానికరం. దీంతో ఆమె ఆరోగ్యం (health) కుదుటపడటానికి రోజుకు అరలీటరు కంటే తక్కువ నీళ్లు తాగాలని వైద్యులు సూచించారు. ఏదైనా మోతాదులోనే తీసుకోవాలని, అతిగా తీసుకుంటే అనారోగ్యమేనని తెలిపారు.