ఎంతోమంది మగవాళ్ల పెదవులు నల్లగా ఉండటం చూస్తుంటాం. ధూమపానం, కాఫీ-టీ సేవించడం, ఇతరత్ర కారణాలతో పెదాలు నల్లగా మారుతుంటాయి. అయితే వాటిని సహజ రంగులోకి మార్చాలని వారు ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఆడవాళ్లకి అయితే మార్కెట్‌లో రకరకాల కలర్‌షేడ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని ఉపయోగించి పెదాలను అందంగా మార్చుకుంటుంటారు. మరి మగవాళ్లకి? అలాంటివి చాలా అరుదుగా అందుబాటులో ఉంటాయి. అయితే మనకి అందుబాటులో ఉన్న వాటితోనే ఈ సమస్యను నివారించవచ్చు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం.
ఆలివ్ ఆయిల్ లేదా తేనెతో కొంత చక్కెర కలిపి లిప్ స్క్రబ్‌ను తయారుచేసుకోవాలి. దీన్ని పెదాలపై కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది పెదాలు నల్లబడటానికి కారణమయ్యే మృత చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.
నల్లని పెదాలను ప్రకాశవంతంగా మార్చడానికి బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ఉపయోగపడుతుంటాయి. నిద్రించే ముందు బీట్‌రూట్ రసాన్ని పెదవులపై రాసి రాత్రంతా అలాగే ఉంచాలి, దాన్ని ఉదయాన్నే కడగాలి.
చర్మంపై పిగ్మెంటేషన్ ను తొలగించడానికి, నల్లబడిన పెదాలను కాంతివంతం చేయడానికి నిమ్మరసం ఎంతో సహాయపడుతుంది. 15 నిమిషాల పాటు నిమ్మరసాన్ని పెదాలపై ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.
‘విట్‌మిన్-ఇ’ని బ్యూటి విటమిన్ అంటారు. ఇది బాదం నూనెలో పుష్కలంగా ఉంటుంది. నల్లబడిన పెదాలను తేమగా, కాంతివంతం చేయడానికి ఇది సహాయపడుతుంది. నిద్రించే ముందు ఈ ఆయిల్‌ను పెదవులపై రాసి రాత్రంతా అలాగే ఉంచాలి.
దోసకాయలో సహజ మెరుపును అందించే లక్షణాలు ఉంటాయి. ఇవి పెదవులపై పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దోసకాయను ముక్కలుగా కట్ చేసి, వాటిని పెదాలపై కొన్ని నిమిషాల పాటు రుద్దాలి. సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచాలి, ఆపై నీటితో కడగాలి.
ఈ చిట్కాలు రోజూ పాటిస్తూ ఉంటే ఉత్తమ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ధూమపానం, టీ, కాఫీ పానియాలకు దూరంగా ఉండాలి. అప్పుడు పెదాలు సహజ రంగులోకి మారే అవకాశం ఉంటుంది. ఈ టిప్స్‌ను ఆడవాళ్లు కూడా పాటించవచ్చు.