పదేళ్ల వయసులోనే 50 దేశాలను చుట్టేయడం సాధ్యమేనా అని ఎవరినైనా ప్రశ్నిస్తే.. కాసేపు ఆలోచించి అసాధారణమేనని ఎక్కువగా చెబుతుంటారు. కానీ బ్రిటన్‌లో నివాసముంటున్న భారత్ సంతతికి చెందిన అదితి త్రిపాఠి ఈ ఘనత సాధించింది. అది కూడా ఒక్క రోజు కూడా స్కూల్‌కు సెలవు పెట్టకుండా విదేశాల్లో విహరించిండం విశేషం.
సౌత్ లండన్‌లో నివాసముంటున్న అదితి త్రిపాఠి తన తల్లిదండ్రులతో కలిసి ఇప్పటివరకు 50 దేశాలలో పర్యటించింది. మూడేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తొలిసారి జర్మనీకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. నేపాల్, భారత్, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి ఎన్నో దేశాలను చుట్టేసింది. త్వరలో ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియాకి కూడా వెళ్లనుంది.
అదితి తల్లిదండ్రులు దీపక్ త్రిపాఠి, అవిలాష బ్యాంకులో అకౌంటెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ ప్రాంతాలను పిల్లలకు చూపించడం వల్ల సమాజంపై వారికి అవగాహన పెరగుతుందని ఆమె తండ్రి దీపక్ వివరించారు. అంతేగాక సంస్కృతి, సంప్రదాయాలు, రకరకాల మనుషుల గురించి తెలుసుకోగలుగుతుందని, ఇది అదికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
అదితి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పర్యటనలు చేస్తుండటానకి పక్కా ప్రణాళికే కారణమని దీపక్ అన్నారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా పర్యటనకు తీసుకెళ్తామని, తిరిగి ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరుకుంటామని అన్నారు. ఒక్కోసారి పర్యటన నుంచి రావడం ఆలస్యమైతే అదితి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా స్కూల్‌కి వెళ్లిపోతుందని వివరించారు. సందర్శన కోసం ఏడాదికి భారత కరెన్సీలో దాదాపు రూ.21 లక్షలు ఖర్చు చేస్తామని అన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులోనే ప్రయాణిస్తామని, ఇంతవరకు తమకు సొంత కారు కూడా లేదని చెప్పారు.
ఎవరెస్టు శిఖరాన్ని చూశా: అదితి
‘‘ఇప్పటివరకు చాలా దేశాలు తిరిగాను. నేపాల్, జార్జియా, అర్మేనియా అంటే ఎంతో ఇష్టం. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చూశా. గుర్రపు స్వారీ కూడా చేశా. పర్యటనలతో ఎన్నో విషయాలను నేర్చుకున్నా’’ అని అదితి తెలిపింది.