మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా? అయితే అన్వేష్ ‘నా అన్వేషణ’ (Naa Anveshana) యూట్యూబ్ ఛానెల్ గురించి వినే ఉంటారు. తన స్థానిక యాసలో మాట్లాడుతూ, హాస్యాన్ని జోడిస్తూ, ప్రపంచ దేశాలు తిరుగుతూ వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. విదేశాలకు విహార యాత్రకు వెళ్లాలనుకునే వారికి ఈ వీడియోలు ఎంతగానే సహాయపడుతుంటాయి. అయితే అన్ని దేశాలు తిరగడానికి తనకి డబ్బు యూట్యూబే ఇస్తుంది. అలా అని ఫ్రీగా కాదు. తన ఆలోచనతో అన్వేష్ యూట్యూబ్ ద్వారా రూ.లక్షల్లో సంపాదింస్తున్నారు. గత నెలలో ఏకంగా రూ.30 లక్షలు అర్జించారు.
అన్వేష్ యూట్యూబ్ ప్రయాణం సాగిందిలా..
‘నా కళ్లతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని..’ అంటూ మనకు సుపరిచితమైన అన్వేష్ ఉత్తరాంధ్ర వాసి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం భీమిలిలో జన్మించారు. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ చేశారు. అనంతరం హోటల్ మేనేమెంట్ చేసి గోవాలో టూరిస్ట్ గైడ్‌గా వర్క్ చేశారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడిగా మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.
‘నా అన్వేషణ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను 2019లో ప్రారంభించారు. తర్వాత 8 నెలలకు ఆదాయం మొదలైంది. అయితే మొదటిసారి రూ.10 వేలు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత పెద్దగా చెప్పుకునే ఆదాయ రాలేదు. కానీ 2021 జూన్‌లో రూ.5 లక్షలు వచ్చాయి. ఆ తర్వాత అతడి అసలు ప్రయాణం మొదలైంది. వచ్చిన డబ్బుతో దుబాయ్ వెళ్లి యూట్యూబ్ ఛానెల్ నిర్వహణ కోసం ఐఫోన్‌లు, డ్రోన్‌లు కొన్నారు. దీంతో 2022 జూన్‌లో అతని ఆదాయం రెట్టింపు అయ్యింది. 15,000 డాలర్లు అంటే అంటే దాదాపు 10 లక్షలు వచ్చాయి. వాటితోనే ప్రపంచ యాత్ర ఘనంగా ప్రారంభించారు.
అయితే ఆరంభంలో కొన్ని ప్రదేశాలు తిరిగి అప్‌లోడ్ చేసిన వీడియోలతో రూ. లక్ష మాత్రమే వచ్చాయి. కానీ ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా అయ్యింది. అయితే చైనా టూర్ అతడికి విపరీత ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా రూ.30 లక్షలు తీసుకువచ్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని యాత్రలు నిర్వహిస్తానని అన్వేష్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 1.35 మిలియన్ల సబ్‌స్క్రెబర్లను మరింత పెరిగేలా ప్రయత్నిస్తానని తెలిపారు.