50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. భారతీయ సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన సువర్ణ అధ్యాయం. 40వేలకు పైగా పాటలు పాడిన గళం.. అన్నింటికీ మించి వివాదాలకు తావులేని వ్యక్తిత్వం. కులమతాలకు అతీతమైన ఆరాధ్య దైవం. పాడడానికే పుట్టారు బాలు. మనల్ని మైమరిపించడానికే జన్మించారు బాలు. సినిమా ఉన్నంతకాలం ఆ మధురస్వరం వినిపిస్తూనే ఉంటుంది. బాలు జీవిస్తూనే ఉంటారు. అందుకే అంటారు బాలు ఫరెవర్ అని.
తెలుగులో ఘంటశాల తర్వాత ఆ స్థానాన్ని పూర్తిస్థాయిలో భర్తీచేసిన ఏకైక గాయకుడు బాలు. సంగీత ప్రపంచానికి ఈయన చేసిన సేవను మాటల్లో చెప్పలేం, పేజీల్లో వర్ణించలేం. జూన్ 4, 1946న నెల్లూరు జన్మించారు బాబు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ను కొంతమంది ఎస్పీబీ అని, అభిమానులు ముద్దుగా బాలు అని పిలుస్తారు.
బాలు తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్న పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం రెండవ వాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.
తిరుపతిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్ళిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. అలా ఓవైపు ప్రదర్శనలు ఇస్తూనే, మరోవైపు తండ్రి కోరిక మేరకు ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో, మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరారు. అదే టైమ్ లో మద్రాసులో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు లు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గుర్తించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చాడు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం సినీ రంగ ప్రవేశం చేశారు.
1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా జీవితం ప్రారంభించారు బాలు. “ఏమి ఈ వింత మోహం” అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి. సుశీల, కల్యాణం రఘురామయ్య, పి. బి. శ్రీనివాస్ లతో కలిసి పాడారు. ఈ చిత్రానికి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్ తో చెప్పి డిలీట్ చేయకుండా అలాగే ఉంచారు కోదండపాణి. తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి బాలుకు అవకాశాలు ఇప్పించేవాడు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.
1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు వచ్చాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటుల హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా బాలు పాటలు పాడేవారు. అందుకే ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి.
40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 16 భాషల్లో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అందించే నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన గాన గంధర్వుడు.
1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళీభవ లాంటి చాలా చిత్రాల్లో కనిపించి, నటనతో కూడా మెప్పించారు.
డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎనలేని గుర్తింపు పొందారు బాలు. డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి డబ్బింగ్ చెప్పి తనకుతానే సాటి అనిపించుకున్నారు.
2020, ఆగస్ట్ 5న కరోనా బారిన పడ్డారు బాలసుబ్రమణ్యం. ఆ విషయాన్ని తనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వెంటనే చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. 2020, సెప్టెంబర్ 25న బాలు మనందర్నీ వీడి వెళ్లిపోయారు. ఈ లోకంలో లేకపోయినా, పాటల రూపంలో ఆయన నిత్యం మనకు గుర్తొస్తూనే ఉంటారు. బాలు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తోంది News360 Telugu.