రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి . ఇంట్లో నుండి బయటకు వస్తే మాడు పగిలిపోతుంది . రోహిణి కార్తి రాకముందే రోళ్ళు పగిలేలా కనిపిస్తుంది . జనసంచారంతో కిటకిటలాడే రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి . అవును ఎండలు భయపెడుతున్నాయి . కొన్ని రోజుల క్రితం కాస్త చల్ల బడినట్టు అనిపించినా మళ్ళీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు , ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు . ఏసీ , కూలర్ లేనిదే అయిదు నిమిషాలు కూడా భరించలేని పరిస్థితి నెలకొంది.
ఇలాంటి పరిస్థితులలో సాధ్యమయినంత వరకు అత్యవసరమయితే తప్ప ఇంటినుండి బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు . వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి తాజా పండ్ల రసాలు , కొబ్బరి నీళ్ళ లాంటివి తాగాలని , కూల్ డ్రింకు లను తాగవద్దని హెచ్చరిస్తున్నారు . వేసవి నుండి ఉపశమనం పొందేలా ఇంటి కిటికీలకు తడి గనీ బ్యాగులను తగిలించాలని తెలిపారు.
పిల్లలకు వేసవి సెలవులు కావడంతో ఆటలాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారని , ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండడంతో వడ గాల్పులు వీస్తాయని కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు . సాయంత్రం 5 దాటాక మాత్రమే పిల్లలను బయటకు వెళ్ళేలా చూసుకోవాలని తెలిపారు . అనుకోని పరిస్థితులలో ఎవరికైనా వడదెబ్బ తగిలినట్లయితే బాదితులను వెంటనే చల్లని గాలిలో పడుకోబెట్టి , తడి గుడ్డతో ఒళ్లంతా తూడవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ORS ప్యాకెట్ లతో పాటు, గ్లూకోజ్ ద్రావణం ఎప్పటికీ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు . నిపుణులైన వైద్యులను సంప్రదించాలని , వైద్యుల సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలని చెబుతున్నారు . అనుభవం లేని వైద్యులను నమ్మి వారిచ్చే సలహాలతో లేని పోని సమస్యలు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు . రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.