గత యూపీఏ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్ వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగాన్ని పునరుద్ధించి, పటిష్ఠ స్థితిలో నిలిపామని అన్నారు. వర్చువల్ విధానంలో రోజ్‌గార్ మేళలో పాల్గొన్న ప్రధాని ఈ మేరకు మాట్లాడారు. 70వేలకు మందికి పైగా వర్చువల్‌గా నియామక పత్రాలను అందజేశారు.
”పటిష్ఠ బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన ప్రస్తుత దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. కానీ 9 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వ అతిపెద్ద స్కామ్‌లలో ‘ఫోన్ బ్యాంకింగ్’ కుంభకోణం అతిపెద్ద వాటిలో ఒకటి. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ వెన్ను విరిచింది. బ్యాంకులకు ఫోన్లు చేసి గత ప్రభుత్వం రూ.వేల కోట్ల రుణాలను అనుకూలమైన వారికి మంజూరు చేయించింది. ఆ రుణాలు తిరిగి చెల్లించలేదు. కానీ, మేం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణను పటిష్ఠం చేశాం” అని మోదీ అన్నారు.