మణిపుర్‌ ఆందోళనలు: ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్​ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించగా, ఎగువ సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తెలిపారు.

మణిపుర్‌ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మణిపుర్‌లో అల్లర్లు, తాజాగా వెలుగులోకి వచ్చిన మహిళపై అమానుషం ఘటనపై చర్చించాలని విపక్షాలు ఆందోళనలకు దిగాయి. ఉదయం 11గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ అంశంపై చర్చకు విపక్షాలు సహకరించాలని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో దిగువ సభ మధ్యాహ్నం12 గంటలకు వాయిదా పడింది.

మరోవైపు రాజ్య సభలోనూ మణిపుర్‌ అంశంపై చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సభా కార్యకలాపాలు రద్దు చేసి దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని కోరాయి. అయితే దీనిపై స్వల్పకాలిక చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించినా, ఇందుకు విపక్షాలు అంగీకరించలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం