Amit shah
Home » ఉభయ సభలు రేపటికి వాయిదా

ఉభయ సభలు రేపటికి వాయిదా

by admin
0 comment

‘మణిపుర్‌ అల్లర్ల’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు.

సోమవారం సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ‘ఇండియా ఫర్ మణిపుర్‌’, ‘మణిపుర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి’ అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను స్పీకర్‌ తాత్కాలిక వాయిదా వేశారు. అనంతరం 2 గంటలకు ఆరంభమైన సమావేశంలో ‘జవాబు చెప్పాలి’ అని విపక్షాలు నినాదాలు చేశాయి.

కాసేపటకీ మణిపుర్‌ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడారు. ”మణిపుర్‌ అంశంపై చర్చ జరగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని అభ్యర్థిస్తున్నా. ఈ సున్నితమైన అంశం గురించి విపక్షాలు చర్చకు ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. మణిపుర్‌ అల్లర్ల సంక్లిష్ట పరిస్థితిపై నిజనిజాలు దేశానికి తెలియాల్సి ఉంది” అని అమిత్‌షా పేర్కొన్నారు. అప్పటికీ విపక్షాలు నినాదాలు చేస్తుండటంతో సభను వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు.

మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. 11 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు మణిపుర్‌ అంశాన్ని లేవనెత్తారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. అనంతరం 12 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమవ్వగా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మణిపుర్‌ అంశంపై ప్రధాని మోదీ సభకు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌పై వేటు పడింది. సభలో అనుచిత ప్రవర్తన కారణంగా ఆయనను వర్షాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ జగదీప్‌ దన్‌ఖడ్‌ ప్రకటించారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links