మద్యం సేవించి విమానాల్లో పాడు పనులు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటికిమొన్న ఫుల్లుగా మందుకొట్టి, తోటి మహిళపై మూత్రం పోసిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది. మద్యం సేవించిన ఓ వ్యక్తి, ఎయిర్ హోస్టెస్ ను వేధించాడు. పోలీసులు ఈరోజు అతడ్ని అరెస్ట్ చేశారు.
దుబాయ్ నుంచి అమృతసర్ కు విమానం టేకాఫ్ అయింది. అప్పటికే ఫుల్ గా తాసేగి ఉన్నాడు రాజేందర్ సింగ్. విమానం ఎక్కిన తర్వాత మరోసారి మద్యం సేవించాడు. ఆ క్రమంలో ఓ ఎయిర్ హోస్టెస్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెను మరింతగా వేధించాడు.
జరిగిన ఘటనపై అమృతసర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు సిబ్బంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానం దిగిన వెంటనే రాజేందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అతడిపై సెక్షన్-354, సెక్షన్-509 కింద కేసు నమోదు చేశారు. రాజేందర్ ను జలంధర్ లోని కొట్లి విలేజ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఈమధ్య తరచుగా విమానాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, తమ విమానాల్లో మద్యం పాలసీపై పరిమితులు విధించింది. త్వరలోనే మరిన్ని విమానయాన సంస్థలు తమ మద్యం పాలసీని మార్చే పనిలో ఉన్నాయి