కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడిన సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్‌కు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్‌ప్రైజ్ ఇచ్చింది. దేశం కోసం ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కానుకతో సత్కరించింది. సంజయ్ ఆదివారం పుణె వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించారు. టేకాఫ్‌కు ముందు ఆయనను గౌరవిస్తూ కెప్టెన్ ప్రత్యేక అనౌన్స్‌మెంట్ చేశారు.
”విమానంలో మనతో పాటు ఓ ప్రత్యేక వ్యక్తి ఉన్నారు. ఆయనే పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్. యుద్ధ వీరుల ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యున్నత గ్యాలెంట్రీ అవార్డు ఇది. భారత చరిత్రలో ఇప్పటివరకు కేవలం 21 మంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు.1999 జులై 4న జమ్మూకశ్మీర్ రైఫిల్స్ 13వ బెటాలియన్ సభ్యుడిగా ఉన్న సంజయ్ కుమార్ కార్గిల్ యుద్ధంలో తీవ్రంగా పోరాడారు. శత్రువుల దాడిలో ఆయన ఛాతీపై రెండు బులెట్లు దూసుకెళ్లినా వెనుదిరగలేదు. రక్తం కారుతున్నా శత్రువుల బంకర్‌లోకి వెళ్లి పాక్ సైనికులను హతమార్చారు” అని కెప్టెన్ ఆయన సేవలను కొనియాడారు.
ప్రస్తుతం దీనికి సంబంధిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల సంజయ్‌ను సుబేదార్ మేజర్ ర్యాంక్‌కు ప్రమోట్ చేశారు. ప్రస్తుతం పుణె సమీపంలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.