ఈ హెడ్డింగ్ చూసిన వెంటనే చాలా మంది ఉద్యోగులు సంబరపడొచ్చు. కానీ ఇది అందరికీ కాదు. కేవలం హర్యానా పరిథిలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే. అక్కడ కూడా మరికొన్ని కండిషన్లు పెట్టింది ఆ రాష్ట్ర సర్కారు.
ఇకపై పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో తక్కువ మోతాదులో ఆల్కహాల్ ఉన్న బీర్, వైన్ లాంటివి తీసుకోవచ్చని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొత్త మద్యం పాలసీకి ఆమోద ముద్ర వేసింది. అయితే ఇలా ఆఫీసుల్లో బీర్ సప్లయ్ చేయాలనుకునే సంస్థలు.. కనీసం 5వేల మంది ఉద్యోగుల్ని కలిగి ఉండాలి. అంతేకాదు, ఆఫీస్ విస్తీర్ణం లక్ష చదరపు అడుగులు ఉండాలి.
ఈ నియమనిబంధనలకు అనుకూలంగా ఉన్న ఆఫీసుల్లో మాత్రమే ఉద్యోగులు మందు కొట్టొచ్చు. హర్యానాతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లోని చాలా సాఫ్ట్ వేర్ సంస్థల్లో మద్యం సేవించడం కామన్ గా మారిపోయింది. ఆఫీస్ వేళల్లో మద్యం సేవించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, చాలామంది ఉద్యోగులు లిక్కర్ సేవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులకు మితంగా మద్యం అందించడానికి కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు అంగీకారం కూడా తెలిపాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హర్యానా సర్కారు.. జూన్ 12 నుంచి కార్పొరేట్ ఆఫీసుల్లో మద్యం సేవించేందుకు అనుమతినిచ్చింది. ఈ అనుమతి కావాలంటే ప్రభుత్వం నుంచి కార్పొరేట్ సంస్థలు, ఎల్-10ఎఫ్ అనే ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఏటా ప్రభుత్వానికి 10 లక్షలు చెల్లించాలి, మరో 3 లక్షల్ని సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఆఫీసుల్లో బీర్, వైన్ లాంటివి పెట్టుకోవచ్చు, ఉద్యోగులకు సరఫరా చేయొచ్చు.