బెంగాల్‌లో ఒకేసారి 36 వేల మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలను కోల్‌కతా హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉద్యోగుల అపాయింట్‌మెంట్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అపాయింట్‌మెంట్ ప్రక్రియలో సరైన విధానాలను పాటించలేదని కోర్టు చెప్పింది. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్‌లో జరిగిన అవినీతి బెంగాల్ చరిత్రలోనే అతిపెద్దదని ఆయన అన్నారు. 2016లో జరిగిన రిక్రూట్మెంట్ సమయంలో ఎంపికైన 36 వేల మంది అభ్యర్థులు సరైన రీతిలో శిక్షణ పొందలేదని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఈ కేసులో 17 పేజీల తీర్పును జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించారు. ఈ తీర్పును హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అభ్యర్థులు విఫలమైనట్లు కోర్టు తెలిపింది. 2014లోని టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకారం శిక్షణ జరగలేదని, అందుకే అపాయింట్‌మెంట్‌ను రద్దు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.