మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మోదీ మీడియాతో గురువారం మాట్లాడారు.
మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన అమానుష ఘటన నా మనస్సుని తీవ్రంగా కలచివేసిందని మోదీ పేర్కొన్నారు. ఈ ఘటన యావత్ భారతీయులను సిగ్గుపడేలా చేసిందని, బాధితులకు జరిగిన అన్యాయాన్ని క్షమించలేమని అన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని, నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టబోమని తెలిపారు. ఈ విషయంపై న్యాయం జరుగుతుందని భారత ప్రజలకు భరోసా ఇస్తున్నాని అన్నారు. ఈ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని కోరారు.
మణిపుర్‌లో కుకీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించి, వారిని నగ్నంగా ఊరేగించిన విషయం తెలిసిందే. మే 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మణిపూర్ ఘటనను సుమోటాగా గురువారం స్వీకరించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.