Virupaksha – విరూపాక్ష మూవీ రివ్యూ (3/5)

నటీనటులు: సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సాయితేజ్, తదితరులు..
బ్యాన‌ర్స్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్
స్క్రీన్ ప్లే: సుకుమార్‌
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌
సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమయ్యాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అనుకున్న టార్గెట్ అందుకుందా? సాయితేజ్ కు మరో సక్సెస్ అందించిందా? news360 ఎక్స్ క్లూజివ్ రివ్యూ

మంత్రాలు-తంత్రాల కథలు టాలీవుడ్ కు కొత్త కాదు. చేతబడి ఆధారంగా సినిమాలు, క్షుద్రశక్తిపై దైవశక్తి గెలవడం లాంటి స్టోరీలు 1980-90ల్లో చాలానే చూశాం. ఈమధ్య ఇలాంటి కథలు తగ్గిపోయాయి. అలాంటి పాత కథకే ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు లవ్ యాంగిల్ జోడించి తీసిన సినిమా విరూపాక్ష. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని వచ్చిన థ్రిల్లర్ ఇది. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ లాంటి టెక్నికల్ అంశాలతో.. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ టైపు సినిమాలొచ్చి చాలా రోజులవ్వడంతో, ఆడియన్స్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు.

ఇదొక మిస్టిక్ థ్రిల్లర్ కాబట్టి, కథ గురించి డీటెయిల్ గా చెప్పుకోకూడదు. బ్రీఫ్ గా చెప్పాలంటే, రుద్రవనం అనే ఊరిలో 1991లో జరిగే కథ ఇది. అంతకు 12 ఏళ్ల కిందట, అంటే, 1979లో ఓ భార్యభర్తను ఊరి ప్రజలు సజీవ దహనం చేస్తారు. ఊరిలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో భార్యాభర్తల్ని చెట్టుకు కట్టి తగలబెట్టేస్తారు. సరిగ్గా పుష్కరానికి ఊరు వల్లకాడు అవుతుందని శపించి ఆ జంట చనిపోతుంది. చెప్పినట్టుగానే ఊరిలో అనుమానాస్పద మరణాలు మొదలవుతాయి. సరిగ్గా అప్పుడే హీరో సాయిధరమ్ తేజ్ ఊరిలో అడుగుపెడతాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ ను చూసి ఇష్టపడతాడు. ఓవైపు ఇలా లవ్ ట్రాక్ నడుస్తుండగానే మరోవైపు, ఊరిలోకి క్షుద్రశక్తులు ప్రవేశిస్తాయి. అవి ఏకంగా హీరోయిన్ నే చుట్టుముడతాయి. వాటి నుంచి తన లవర్ ను, ఊరిని హీరో ఎలా కాపాడుకున్నాడనేది స్టోరీ.

ఇలా చెప్పుకుంటే కథ సింపుల్ గానే అనిపించొచ్చు, కానీ ఇందులో భయంకరమైన ట్విస్ట్ ఉంది. అది క్లయిమాక్స్ లో తెలుస్తుంది. ఈ సినిమాని నిలబెట్టింది, మనం చెప్పుకున్న సింపుల్ కథకు కొత్తదనం తీసుకొచ్చింది ఆ ట్విస్టే. అది ఇక్కడ చెప్పడం కంటే థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది.

నటీనటుల పెర్ఫార్ఫెన్స్ కంటే, టెక్నీషియన్స్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. దర్శకుడు కార్తీక్ దండు పాత కథనే రాసుకున్నాడు. కాకపోతే ఇంతకుముందే చెప్పుకున్నట్టు 2 బలమైన ట్విస్టుల్ని అతడు నమ్మాడు. సుకుమార్ కూడా అదే ట్విస్టుల మీద ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. ఇలాంటి కథలు థియేటర్లలోకొచ్చి చాలా రోజులైంది. పైగా ఓ స్టార్ హీరో చేసి చాలా రోజులైంది. అది విరూపాక్షకు పెద్ద ప్లస్ పాయింట్. దీనికి అజనీష్ లోకనాధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ కలిసొచ్చాయి. థ్రిల్లర్ జానర్ సినిమాలకు కావాల్సిన సౌండ్ ఎపెక్టులు, ఫ్రేమ్స్ అన్నింటినీ వీళ్లిద్దరూ సమకూర్చి పెట్టారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆర్ట్ వర్క్ గురించి కూడా చెప్పుకోవాలి. రుద్రవనం అనే ఫిక్షనల్ విలేజ్, అందులో ఇళ్లు, గుడి లాంటి సెట్స్ చాలా బాగున్నాయి. కథలో లీనమయ్యేలా చేశాయి.

సాయిధరమ్ తేజ్ కు ఈ స్టోరీ చాలా కొత్త. కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి కథ అతడు టచ్ చేయలేదు. తను జీవించలేదని, నటించానని మాత్రం ఎందుకు చెప్పాడో సినిమా చూస్తే అర్థమౌతుంది. అయితే యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ పై తీసిన కొన్ని సన్నివేశాలు అంతగా మెప్పించవు. పరుగెత్తే సన్నివేశాల్లో సాయితేజ్ స్టయిల్ అంతగా మెప్పించదు. అతడి బాడీ లాంగ్వేజ్ లో కూడా చిన్న తేడా కనిపించింది. ఇక గొంతు గురించి అందరికీ తెలిసిందే. కొన్ని డైలాగులు స్పష్టంగా పలకలేకపోయాడు. యాక్సిడెంట్ కు ముందు, యాక్సిడెంట్ తర్వాత తెరపై సాయిధరమ్ తేజ్ ఎలా ఉన్నాడనేది క్లియర్ గా తెలిసిపోతోంది. అయితే రివ్యూలో లోపాలుగా వీటిని చెప్పుకోకూడదు, త్వరలోనే వాటిని సాయితేజ్ అధిగమిస్తాడు.

హీరోయిన్ సంయుక్త మీనన్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నందిని అనే పాత్ర పోషించిన ఈ బ్యూటీని, సినిమాలో హీరోయిన్ అనే కంటే, సెకెండ్ హీరో అంటే బెటర్. ఆమె పాత్రకు అంత వెయిట్ ఉంది. ఇతర పాత్రలు పోషించిన వాళ్లలో ఆలయ పూజారిగా సాయిచంద్, అఘోరాగా అజయ్, డాక్టర్ గా బ్రహ్మాజీ, సర్పంచిగా రాజీవ్ కనకాల తమ పాత్రలకు న్యాయం చేశారు. చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ, కీలకమైన పాత్ర పోషించిన సోనియా ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

ఓపెన్ చేయడంతోనే నేరుగా కథలోకి వెళ్లిపోయిన దర్శకుడు, ఎక్కడా ట్రాక్ తప్పలేదు. తన కథనానికి అడ్డొస్తుందని భావించి పాటల్ని కూడా తగ్గించేశాడు, కొన్నింటిని కుదించేశాయి. పూర్తిగా కథను బేస్ చేసుకొని సినిమాను ముందుకు నడిపించాడు. ఈ విషయంలో సాయిధరమ్ తేజ్ కు ఆల్రెడీ ఉన్న స్టార్ ఇమేజ్ ను కూడా అతడు పట్టించుకోకపోవడం చెప్పుకోదగ్గ అంశం. అలా దారితప్పకుండా కథను నడిపించడమే విరూపాక్షకు ప్లస్ అయింది. అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేసిన దర్శకుడు, సెకెండాప్ లో స్క్రీన్ ప్లేను పరుగులుపెట్టించాడు. అయితే సస్పెన్స్ ను మెయింటైన్ చేయడం కోసం పెట్టిన సునీల్ పాత్రను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. దీంతోపాటు హీరోయిన్, ఆమె తండ్రికి మధ్య అనుబంధాన్ని కూడా చూపించి ఉంటే ఎమోషన్ ఇంకా బాగా పండి ఉండేది.

ఓవరాల్ గా.. మంచి ట్విస్టులు, టెక్నికల్ అంశాల కోసం విరూపాక్ష సినిమాను ఓసారి చూడొచ్చు. ఇది మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400