Vimanam Movie Review – విమానం మూవీ రివ్యూ

న‌టీన‌టులు: స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్
ప్రొడ్యూస‌ర్స్‌: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌)
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌పీ: వివేక్ కాలేపు
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌: చ‌ర‌ణ్ అర్జున్‌
డైలాగ్స్‌: హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం)
రన్ టైమ్: 2 గంటల 2 నిమిషాలు
రేటింగ్: 2.75/5

మంచి కథల కోసం విదేశాలకు వెళ్లి సిట్టింగ్స్ వేయనక్కర్లేదు. స్లమ్స్ లో తిరిగినా చాలు. మనసుకు హత్తుకునే, గుండెలు పిండేసే ఎన్నో జీవితాలు కళ్లముందు కనిపిస్తాయి. అలాంటి మురికివాడ కథే ఈ విమానం. సినిమా చూస్తున్నంతసేపు, మన పక్కనే ఉన్న మురికివాడలో ఇది నిజంగా జరిగిందేమో అనే ఫీలింగ్ వస్తుంది విమానం సినిమా చూస్తే. పాత్రలన్నీ అత్యంత సహజంగా, సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కింది విమానం సినిమా.

ఇందులో హీరోహీరోయిన్లు ఉండరు, ఐటెంసాంగ్స్ కనిపించవు, యాక్షన్ సీక్వెన్సులుండవు, భారీ డైలాగ్స్ వినిపించవు. కానీ సినిమా సింపుల్ అండ్ స్వీట్ అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓ రకమైన ఎమోషనల్ టచ్ తో సినిమా సాగుతుంది. ఇంతకీ విమానం సినిమా కథేంటి?

వీరయ్య, అంగవైకల్యంతో బాధపడుతున్న ఒక మధ్య వయస్కుడైన ఒంటరి తండ్రి. అతను నివసించే ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. వీరయ్యకు ఏడేళ్ల రాజు అనే కొడుకు ఉంటాడు. అతను ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతుంటాడు, చాలా తెలివైనవాడు. కోరుకొండ సైనిక స్కూల్ కు కూడా సెలక్ట్ అవుతాడు. రాజుకు విమానాలంటే చాలా ఇష్టం, విమానం ఎక్కాలనేది ఆ పిల్లాడి డ్రీమ్. వీరయ్య రాజుకి ఏదో ఒక సాకు చెబుతూ, విమానం ఎక్కాలనే కొడుకు కోరికను వాయిదా వేస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల మధ్య కొడుకును విమానం ఎక్కించాలని డిసైడ్ అవుతాడు వీరయ్య. ఆ పరిస్థితేంటి? కొడుకు కలను వీరయ్య నెరవేర్చాడా.. దాని కోసం ఎన్ని పోరాటాలు చేశాడు.. ఫైనల్ గా వీరయ్య-రాజుల కథ ఏ మలుపు తీసుకుందనేది ఈ విమానం కథ.

ఈమధ్య కాలంలో వచ్చిన మోస్ట్ ఎమోషనల్ మూవీస్ లో విమానం ఒకటి. అలా అని ఇది మరీ కంటతడి పెట్టించేంత సినిమా కూడా కాదు. దర్శకుడు శివప్రసాద్ మంచి పాయింట్ రాసుకున్నాడు కానీ, రాసుకున్న సన్నివేశాల్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించలేకపోయాడు.

సినిమా స్టార్ట్ అవ్వడం కూల్ గానే మొదలవుతుంది. పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. ఎప్పుడైతే రాజు పాత్రకు ఓ సమస్య మొదలవుతుందో, అక్కడ్నుంచి సినిమా ఊపందుకుంటుంది. అదే టైమ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ వేసి, అదే టెంపోలో సినిమాను పరుగులుపెట్టించాడు దర్శకుడు. సెకెండాప్ నుంచి సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ను తలపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు.

ఈ సినిమాలో ప్రధానంగా సముద్రఖని గురించి చెప్పుకోవాలి. వికలాంగుడిగా, ఓ తండ్రిగా అతడి యాక్టింగ్ సినిమాకు మేజర్ హైలెట్. అతడి కోసం విమానం సినిమాను కచ్చితంగా ఓసారి చూడాల్సిందే. ఇక చెప్పులు కుట్టే కోటిగా రాహుల్ రామకృష్ణ, ఆటో డ్రైవర్ డానీగా ధనరాజ్, వేశ్య సుమతిగా అనసూయ, తమ పాత్రలకు న్యాయం చేశారు.

విమానం సినిమాకు మ్యూజిక్ బ్యాక్ బోన్‌గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అందించిన ట్యూన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్. పలు సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేశాడు.ఇక వివేక్ అందించిన సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. హను రావూరి అందించిన డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. అయితే ఇలాంటి ఎమోషనల్ మూవీలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టడం మాత్రం బాగాలేదు. ఓవరాల్ గా తండ్రికొడుకుల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ తో తెరకెక్కిన విమానం సినిమా, ఓ మంచి హార్ట్ టచింగ్ ఫీలింగ్ ఇస్తుంది. రన్ టైమ్ కూడా క్రిస్పీగానే ఉంది కాబట్టి, థియేటర్లలో ఓసారి ట్రై చేయొచ్చు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400