వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న వరుణ్ తేజ్ (Varun Tej) తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా లాంఛ్ అయింది. హరీశ్ శంకర్, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రముఖులు హాజరయ్యారు. సురేష్ బాబు, చిత్ర నిర్మాతలు దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు మారుతి కెమెరా స్విచాన్ చేయగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. టైటిల్ పోస్టర్‌ను హరీష్ శంకర్ లాంచ్ చేశారు.
వరుణ్ తేజ్, కరుణకుమార్ సినిమాకు ‘మట్కా’ (Matka) అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ‘మట్కా’ అనేది ఒక రకమైన జూదం. ఈ జూదానికి, హీరోకు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు దర్శకుడు. 1958-1982 మధ్య యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. 1958 నుంచి 82 వరకు సాగే కథలో వరుణ్ తేజ్ ని 4 డిఫరెంట్ గెటప్స్ లో చూడబోతున్నారు ప్రేక్షకులు. వరుణ్ తేజ్ కు జోడిగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించనున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.