ఖాకీ చొక్కా.. తిరుగులేని బాక్సాఫీస్ ఫార్ములా. ఏ హీరోకైనా వరుసగా ఫ్లాపులొస్తే చాలు, వెంటనే ఓ పోలీస్ క్యారెక్టర్ చేస్తాడు, హిట్ కొడతాడు. టాలీవుడ్ హిస్టరీ చెబుతున్న సత్యం ఇది. సినిమాల్లో పోలీసు పాత్రలు అంత పాపులర్. అంతెందుకు, కేవలం పోలీస్ పాత్రల మీదే కెరీర్ లాగించేసిన హీరోలు కూడా సౌత్ లో చాలామంది ఉన్నారు. అయితే ఈ ఫార్ములా ఇప్పుడు నడవడం లేదు.
పోలీస్ పాత్రలతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ బరిలో పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా అరడజను పోలీస్ సినిమాలు ఈమధ్య కాలంలో ఇలా వచ్చి అలా ఫ్లాప్ అయ్యాయి. దీనికి తాజా ఉదాహరణ కస్టడీ. నాగచైతన్య కానిస్టేబుల్ శివగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఫస్ట్ వీకెండ్ కే ఫ్లాప్ అని తేలిపోయింది.
ఇంకాస్త వెనక్కు వెళ్తే.. కస్టడీ కంటే ముందు ఉగ్రం వచ్చింది. అల్లరినరేష్ పోలీస్ గా నటించిన ఈ సినిమా రిలీజైన కొత్తలో ఓకే అనిపించుకున్నప్పటికీ, సక్సెస్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఇంకా వెనక్కు వెళ్తే.. మీటర్ సినిమాది కూడా ఇదే కథ. కిరణ్ అబ్బవరం తొలిసారి ఖాకీ చొక్కా వేసుకొని చేసిన ఈ సినిమా కూడా ఫ్లాప్. కొన్నాళ్ల కిందట.. అల్లూరి, హంట్, వారియర్ సినిమాలొచ్చాయి. శ్రీవిష్ణు పోలీస్ గా నటించిన సినిమా అల్లూరి.
ఇక సుధీర్ బాబు పోలీసాఫీసర్ గా చేసిన సినిమా హంట. ఇక రామ్ పోతినేని ఖాకీ చొక్కా వేసుకున్న సినిమా ది వారియర్. ఈ 3 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే, ఈమధ్య కాలంలో పోలీస్ కథతో వచ్చిన సినిమాలేవీ తెలుగులో క్లిక్ అవ్వలేదు. చివరికి ఖాకీ చొక్కా కథతో వచ్చిన డబ్బింగ్ మూవీ విడుదల పార్ట్-1 కూడా తెలుగులో ఫ్లాప్ అయింది. చూస్తుంటే.. టాలీవుడ్ ఆడియన్స్ కు పోలీస్ కథలపై మొహం మొత్తినట్టుంది. కొన్నాళ్ల పాటు ఖాకీ చొక్కాని టాలీవుడ్ హీరోలు దూరం పెడితే మంచిదేమే.