Home » SPY Movie Review – స్పై మూవీ రివ్యూ

SPY Movie Review – స్పై మూవీ రివ్యూ

SPY Movie Review

by admin
0 comment

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, రానా దగ్గుబాటి, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్, సన్య థాకూర్, మక్రంద్ దేశ్ పాండే, జిస్సు సేన్ గుప్తా తదితరులు
దర్శకుడు & ఎడిటర్: గ్యారీ బీహెచ్
కథ & నిర్మాత: కే రాజశేఖర్ రెడ్డి
బ్యానర్: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
డీఓపీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
రచయిత: అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
రన్ టైమ్: 2 గంటల 15 నిమిషాలు
సెన్సార్: U/A
రేటింగ్: 2/5

సినిమాకు ఏది కావాలన్నా కథ డిమాండ్ చేస్తుంది. అది బడ్జెట్ అయినా, స్టార్ కాస్ట్ అయినా, చివరికి వసూళ్లు అయినా.. ఏదైనా కథ మీద ఆధారపడి ఉంటుంది. ఈ బేసిక్ రూల్ ను స్పై యూనిట్ మరిచిపోయింది. పాన్ ఇండియా కథ రాసుకున్నారు వీళ్లు. కానీ ఆ కథకు తగ్గట్టు పాన్ ఇండియా బడ్జెట్, పాన్ ఇండియా స్టార్ కాస్ట్ పెట్టుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా ఆ కథకు, మంచి డైరక్టర్ కావాలనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయినట్టున్నారు.

స్పై సినిమాలో హీరో ఓ గూఢచారి. అంతర్జాతీయ ఉగ్రవాది ఖాదిర్ ను పట్టుకోవడం ఇతడి లక్ష్యం. ఐదేళ్లుగా అదే మిషన్ లో ఉంటాడితను. పనిలోపనిగా రా ఏజెంట్ గా పనిచేసి చనిపోయిన తన అన్నయ్య హత్యకు కారణం కనుక్కోవడం కూడా ఇతడి వ్యక్తిగత మిషన్. ఇలాంటి టైమ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీకి చెందిన కీలకమైన ఫైల్ మిస్ అవుతుంది. అది బయటకొస్తే దశ భద్రతకే ముప్పు అని చెబుతారు సినిమాలో. దీంతో ఆ ఫైల్ ను కనిబెట్టే పనిని కూడా మన హీరో గూఢచారికి అప్పగిస్తారు. ఈ 3 మిషన్లను హీరో ఎలా పూర్తిచేశాడనేది స్పై సినిమా.

ఇలా అంతర్జాతీయ స్థాయిలో కథ రాసుకుంటే సరిపోదు, దానిచుట్టూ అల్లుకునే సన్నివేశాలు, స్క్రీన్ ప్లే కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. స్పైలో ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. సినిమా స్టార్ట్ అవ్వడమే రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. ఓ మిషన్, హీరో ఎంట్రీ, అతడి ఆశయం.. ఇలా సాగుతుంది కథ. ఇంటర్వెల్ బ్యాంగ్ కు వచ్చేసరికి నేతాజీ డెత్ మిస్టరీ తెరపైకొస్తుంది. ఊహించిన ట్విస్ట్ తోనే ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

నేతాజీ డెత్ మిస్టరీని టచ్ చేశారు కాబట్టి సెకెండాఫ్ నుంచి సినిమా ఊపందుకుంటుందని అనుకుంటాం. కానీ రెండో అర్థభాగంలో కూడా అదే రొటీన్. ఎక్కడా ట్విస్టులు, టర్న్ లు లేకుండా సాగిపోతాడు ఈ స్పై. ఇలాంటి గూఢచారి సినిమాలు ఎలా ఉండాలో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు అడివి శేష్. అతడు తీసిన గూఢచారి సినిమాకు దరిదాపుల్లోకి కూడా రాదు ఈ స్పై.

సినిమా స్క్రిప్ట్ చాలా సిల్లీగా ఉంది. ఒక టైమ్ లో భారత్-చైనా యుద్ధం గురించి కూడా మాట్లాడతారు, సన్నివేశాలు మాత్రం అలా ఉండవు. టెర్రరిస్ట్ ఖాదిర్ ఎపిసోడ్స్ అయితే మరీ రొటీన్. ఇక సెకండాఫ్ లో వచ్చిన మరో విలన్ కూడా తేలిపోవడంతో స్పై సినిమా స్క్రీన్ ప్లే ప్రేక్షకుడి కనుసన్నల్లో సాగుతుంది. ఉన్నంతలో నేతాజీ డెత్ మిస్టరీపై తీసిన సన్నివేశాలు మాత్రం ఆకట్టుకున్నాయి.

టెక్నికల్ గా చూసుకుంటే, సినిమాకు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ వర్క్ బాగుంది. కాకపోతే ఈ కథకు, ఈ సెటప్ కు ఇద్దరు సంగీత దర్శకులు అనవసరం. వంశీ పచ్చిపులుసు కెమెరా వర్క్ బాగుంది. ఈ నీరసమైన స్క్రీన్ ప్లేకు ఎడిటర్ ఇంతకుమించి ఏం చేయలేడనిపిస్తుంది. నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాత్రం బాగా ఖర్చుచేశాడు. తను రాసుకున్న కథే కావడం వల్ల ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అయితే ఈ భారీ కథకు అది చాలదు.

తొలిసారి స్పైగా నటించిన నిఖిల్ డీసెంట్ గా చేశాడు. కానీ ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే కాదు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కూడా రా ఏజెంట్ గా చేసింది. అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ ఓకే. కాకపోతే అప్పటివరకు కామెడీ పంచ్ లు, సెటైర్లు వేసిన అభినవ్.. గూఢచారిగా గన్ పట్టుకొని ఫీల్డ్ లోకి దూకడం చూస్తే నవ్వొస్తుంది. దాని బదులు అతడ్ని గూఢచారి క్యాంపులో తెరవెనక ఏజెంట్ గా చూపించి ఉంటే బాగుండేది. రా చీఫ్ గా మకరంద్ దేశ్ పాండే ఓవరాక్షన్ చేశాడు. టెర్రరిస్ట్ ఖాదిర్ గా చేసిన నితిన్ మెహతా బాగా చేశాడు, కాకపోతే అతడికి స్క్రీన్ టైమ్ ఇవ్వలేదు దర్శకుడు. మరో విలన్ గా నటించిన జిషు సేన్ గుప్తా ఓకే.

ఓవరాల్ గా చూసుకుంటే, స్పై సినిమాకు అంతర్జాతీయ స్థాయి కథ రాసుకొని, అమీర్ పేట సెటప్ పెట్టారు. బడ్జెట్ బాగానే ఖర్చు చేసినప్పటికీ ఈ కథకు అది చాలదు. ఇలాంటి బరువైన పాత్రలకు ఆ నటీనటులు సరిపోరు. గ్రాండ్ గా తీయాలనుకున్నప్పుడు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తీయాలి. పరిమితులకు లోబడి తీయాలనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే లో జిమ్మిక్కులు, డైరక్షన్ లో టాలెంట్ చూపించాలి. అద్భుతంగా ఎమోషన్ పండించగలగాలి. దర్శకుడు గ్యారీ ఈ రెండు విభాగాల్లో ఎందులోనూ సెట్ అవ్వలేదు. స్పై సినిమా పూర్తిగా డైరక్షనల్ ఫెయిల్యూర్.

బాటమ్ లైన్ – డైరక్షన్ లేని స్పై

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links