‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న సినిమా ‘గుంటూరు కారం’. ఇందులో పూజా హెగ్దే మెయిన్ హీరోయిన్. అయితే ఇది గతంలో. ఇప్పుడు ఈ సినిమాలో ఆమె లేదు.
ఎస్.. ‘గుంటూరు కారం’లో పూజా హెగ్దే నటించడం లేదు. ఎందుకు? ఏమిటి? అనేది ప్రస్తుతానికి బయటకు రాలేదు. చిత్ర బృందం సైతం అధికారికంగా దీని గురించి ఏమీ స్పందించలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే… ఆల్రెడీ పూజా హెగ్దే స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకున్నారట. గుంటూరు కారం’లో పూజా హెగ్దే బదులు మలయాళ భామ సంయుక్తా మీనన్ ను ఎంపిక చేసినట్టు టాక్ నడుస్తోంది.
గురూజీ త్రివిక్రమ్ స్క్రిప్ట్, పర్యవేక్షణలో రూపొందిన ‘భీమ్లా నాయక్ ‘తో తెలుగు తెరకు సంయుక్తా మీనన్ పరిచయం అయింది. ఆ తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ‘సార్’ లో కూడా నటించింది. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని అందుకుందట సంయుక్త.
ఇదే కనుక నిజమైతే, తెలుగులో ఆమెకు పెద్ద అవకాశం వచ్చినట్లే. ఆల్రెడీ ‘గుంటూరు కారం’లో శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘గుంటూరు కారం’ లేటెస్ట్ షెడ్యూల్ శనివారం నుంచి స్టార్ట్ కానుంది. అందులో మహేష్ బాబు సహా ఇతర ప్రధాన తారాగణం అందరూ జాయిన్ అవుతారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది గుంటూర కారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అతడు కూడా సినిమా నుంచి తప్పుకొన్నట్లు వార్తలొచ్చాయి. వాటిని ఆయనతో పాటు, నిర్మాత కూడా ఖండించారు.