టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ మూవీ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. అది కూడా మరో మూడు రోజుల్లో ముగియనుంది.
మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో తెరకెక్కిస్తున్న సిటడెల్ వెబ్ సిరీస్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ రెండు షూటింగ్ లు పూర్తయిన తర్వాత సమంత మరే ఇతర సినిమాలుగానీ, వెబ్ సిరీస్ లుగానీ ఆమె అంగీకరించడం లేదు. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె డిసైడైంది.
ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో సమంత ఎలాంటి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న సామ్.. ఈ బ్రేక్ సమయంలో అదనపు చికిత్స తీసుకొని, పూర్తిగా కోలుకోవాలని భావిస్తోంది. దీంతో గతంలో తాను కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన అడ్వాన్స్ లను కూడా సమంత ప్రొడ్యూసర్లకు తిరిగి ఇచ్చేస్తోంది.
చాలా కాలంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాని కోసం ఆమె చికిత్స తీసుకుంటూనే ఉంది. యశోద, శాకుంతలంలాంటి సినిమాలను అలాగే చేసింది. పక్కన సెలైట్ బాటిల్ పెట్టుకొని యశోద మూవీ కోసం ఆమె డబ్బింగ్ చెబుతున్న ఫొటో కూడా వైరల్ అయింది. ఆ తర్వాత ఇలాంటి సీన్లు అప్పుడప్పుడూ కనిపించాయి.
దీంతో సినిమాలకు కాసేపు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఆమె చూస్తోంది.