నటీనటులు: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: వెట్రి పళనిసామి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కథ: భూపతి రాజా
రన్ టైమ్: 2 గంటల 31 నిమిషాలు
రేటింగ్: 2/5
“మారుతున్న ప్రపంచంతో మనం కూడా మారాలి.” రామబాణం సినిమాలో డైలాగ్ ఇది. సినిమా పూర్తయిన తర్వాత ఈ డైలాగ్ ను అదే పనిగా దర్శకుడు శ్రీవాస్ కు చెప్పాలనిపిస్తుంది. ప్రపంచం మారింది, ఆడియన్స్ అభిరుచి మారింది, సినిమా పోకడ మారింది. కానీ శ్రీవాస్ మాత్రం మారలేదు. అదే నెరేషన్, అదే రొటీన్ స్టఫ్. గోపీచంద్ తో ఏడేళ్ల కిందట ఓ సినిమా తీసిన ఈ దర్శకుడు, ఇప్పుడు కూడా దాదాపు ఏడేళ్ల కిందటి కథనే ఎత్తుకున్నాడు. ఇంకా చెప్పాలంటే దీన్ని ఏడేళ్ల కిందట కథ కూడా అనలేం. 17 ఏళ్ల కిందటి కథగా చెప్పొచ్చు.
ఇందులో హీరో పేరు విక్కీ. ఎలాగైనా ధనవంతుడ్ని అవుతానంటూ అన్నయ్య రాజారాంతో ఛాలెంజ్ చేస్తాడు, చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కోల్ కతా వెళ్లి పెద్ద డాన్ అవుతాడు, బాగానే సంపాదిస్తాడు. అతడి లైఫ్ లోకి భైరవి వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత కుటుంబం అవసరం ఏర్పడుతుంది. దాంతో విక్కీ ఇంటికొస్తాడు. అన్నయ్యను సమస్యలు చుట్టుముడతాయి. మరీ ముఖ్యంగా బిజినెస్ మేన్ జీకే, రాజారాంకు అడ్డుగా ఉంటాడు. వాటిని తమ్ముడు పరిష్కరిస్తాడు? అదే ఈ రామబాణం సినిమా.
సినిమా స్టార్ట్ అయినప్పట్నుంచి శుభం కార్డు పడే వరకు, ప్రతి సీన్ లో ఈ దశాబ్ద కాలంలో వచ్చిన ఏదో ఒక సినిమా గుర్తొస్తుంది. అంత రొటీన్ గా తీశాడు రామబాణం సినిమాని. దర్శకుడి సంగతి కాసేపు పక్కనపెట్టి, హీరో విషయానికొద్దాం. తన ప్రతి ఇంటర్వ్యూలో స్టోరీల గురించి, సినిమా రిజల్ట్ ల గురించి భలేగా చెబుతుంటాడు గోపీచంద్. సినిమా షూటింగ్ టైమ్ లో తనకు రిజల్ట్ తెలిసిపోతుందని, ఇక చేసేదేం లేక సినిమాను పూర్తిచేసి జనాల మీదకు వదిలేస్తామని చెప్పుకొచ్చాడు. నిజంగా గోపీచంద్ కు అంత జడ్జిమెంట్ ఉంటే, రామబాణం సినిమా షూటింగ్ టైమ్ లోనే అతడికి మేటర్ అర్థమైపోయి ఉండాలి, మనకెందుకు వచ్చిన గొడవలే అని జనాల మీదకు ఈ తుప్పుపట్టిన బాణాన్ని వదిలేసి ఉండాలి. అసలు సంగతి ఇది కాదు, నిజంగా గోపీచంద్ కు అంత స్క్రిప్ట్ సెన్స్ ఉంటే, నెరేషన్ టైమ్ లోనే ఇది రొట్టకొట్టుడు కథ అని తెలుసుకొని ఉండాల్సింది.
దర్శకుడు, హీరోను కాసేపు పక్కనపెట్టి, ఇప్పుడు ప్రేక్షకుల విషయానికొద్దాం. ఈ సినిమా ప్రమోషన్స్ లో గోపీచంద్ పదేపదే ఓ మాట చెబుతూనే ఉన్నాడు. కథలు కొత్తగా పుట్టుకురావు, ఉన్న కథల్ని ఎఁత కొత్తగా చెప్పామనేది ముఖ్యం అన్నాడు. సన్నివేశాల్లో కంటెంట్ కొత్తగా లేకపోయినా, ప్రజెంటేషన్ కొత్తగా ఉందని అన్నాడు. అప్పుడే ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది. అంత తెలివి ఉంటే, ఈరోజు మార్నింగ్ షోకు ఇలా దొరికిపోయి ఉండేవారు కాదు.
కథలో పస లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? నటీనటులు కూడా అదే చేశారు. జగపతిబాబు, గోపీచంద్ తో పాటు.. డింపుల్, ఖుష్బూ, నాజర్.. ఇలా అందరూ రోబోల్లో నటించి వెళ్లిపోయారు. ఉన్నంతలో 2-3 కామెడీ సీన్లు ఈ రెండున్నర గంటల టార్చర్ లో రిలీఫ్ ఇస్తాయి. టెక్నికల్ కూడా కూడా సినిమా ఏడేళ్ల కిందటే ఉంది. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్ తో పాటు చివరికి కాస్ట్యూమ్స్ కూడా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే.. డైలాగ్స్ కూడా దశాబ్దం కిందటివే. ఓవరాల్ గా రామబాణం సినిమా రొటీన్ బాణం అనిపించుకుంది. ఏ దశలోనే, ఏ కోశానా ఇది ఆకట్టుకోదు.
బాటమ్ లైన్ – రొటీన్ బాణం