బ్లాక్బస్టర్ ఫిల్మ్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య జరిగిన హీరో పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ థండర్ పేరిట వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. రామ్-బోయపాటి సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేద్దామనుకున్నారు.
కానీ ఆ టైమ్ కు బాలయ్య సినిమా లైన్ ఉంది. అంతకంటే ముందు పంద్రాగస్ట్ కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఆ టైమ్ కు చిరు సినిమా సిద్ధం అవుతోంది. దీంతో అటు చిరంజీవి, ఇటు బాలయ్య సినిమాలకు మధ్యలో సెప్టెంబర్ 15న రావాలని డిసైడ్ అయ్యారు. అలా వినాయక చవితికి 4 రోజుల ముందు వస్తోంది రామ్-బోయపాటి సినిమా.
ఈ సినిమా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు దక్కాయి. హీరో పేరు వచ్చేలా కంపోజ్ చేసిన బీజీఎమ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.
ప్రస్తుతానికి స్కంధ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ టైటిల్ ఏమైనా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుందా, మాస్ జనాల్లోకి వెళ్తుందా వెళ్లదా అనే అంశాలపై యూనిట్ లో చర్చ జరుగుతోంది. బోయపాటి సినిమాకు పవర్ ఫుల్ టైటిల్స్ పెడతారు. కానీ స్కంధ అనేది ఆ స్థాయిలో ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది.