రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఊహించని విధంగా ఈ సినిమా సక్సెస్ అయింది. అప్పటివరకు సక్సెస్ లేని పూరి-రామ్ కు మంచి విజయాన్నందించింది. బాధాకరమైన విషయం ఏంటంటే,, ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరికీ మళ్లీ హిట్స్ లేవు. పూరి జగన్నాధ్ చేసిన లైగర్ డిజాస్టర్ అయింది. అటు రామ్ చేసిన వారియర్ సినిమా కూడా డిజాస్టర్ అయింది.
దీంతో ఇప్పుడు మరో సక్సెస్ కోసం, ఈ ఇద్దరూ మరోసారి కలిశారు. ఇస్మార్ట్ శంకర్ మేజిక్ ను రిపీట్ చేయాలని డిసైడ్ అయ్యారు రామ్-పూరి. ఇది అచ్చంగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనే టాక్ నడుస్తోంది. సినిమాకు టైటిల్ కూడా సీక్వెల్ అర్థం వచ్చేలా పెడతారంట. 15న రామ్ పుట్టినరోజు. ఆ రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి.
గమ్మత్తైన విషయం ఏంటంటే, హీరోయిన్లుగా కూడా నభా నటేష్, నిధి అగర్వాల్ నే కొనసాగిస్తారట. పూరి జగన్నాధ్ తో వ్యవహారం మామూలుగా ఉండదు. ఇలా సినిమా మొదలైందనుకునేలోపే, పూర్తయిపోతుంది. అంత ఫాస్ట్ గా ఉంటుంది మేకింగ్. అందుకే పూరి కోసం తన కమిట్ మెంట్ సైతం పక్కనపెట్టాడు రామ్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్.
ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే మరో ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావాల్సి ఉంది. పూరి జగన్నాధ్ చెప్పిన కథ నచ్చడంతో, అంగీకరించిన ప్రాజెక్ట్ పక్కనపెట్టి మరీ పూరీకి కాల్షీట్లు ఇచ్చాడు. లైగర్ సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన పూరి జగన్నాధ్… ఇస్మార్ట్ శంకర్-2తో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు.