PremKumar Review | ప్రేమ్ కుమార్ రివ్యూ

నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు
కథ : అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి
పాటలు : కిట్టూ విస్సాప్రగడ
ఛాయాగ్రహణం : రాంపీ నందిగాం
సంగీతం : ఎస్. అనంత్ శ్రీకర్
నిర్మాత : శివప్రసాద్ పన్నీరు
రచన, దర్శకత్వం: అభిషేక్ మహర్షి
విడుదల తేదీ: ఆగస్టు 18, 2023
నిడివి: 2 గంటల 32 నిమిషాలు
సెన్సార్: UA
రేటింగ్ : 2/5

వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ అనుకున్న ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే కల్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే సినిమాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈసారి సంతోష్ శోభన్ హిట్ కొట్టాడా? న్యూస్ 360 తెలుగు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ
ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్), నేత్ర (రాశి సింగ్) పెళ్లి మండపంలో ఉన్నారు. కాసేపట్లో పెళ్లి. రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. తానూ, నేత్ర ప్రేమించుకున్నామని, పెళ్లి చేయమని కోరతాడు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ మరో పెళ్లికి రెడీ అవుతాడు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్. ఇక పెళ్లి చూపులైతే లెక్క లేదు. ఆ ట్రాక్ రికార్డు అలా కంటిన్యూ అవుతుంది. పెళ్లి కావడం లేదని ఫ్రస్ట్రేషన్‌లో ప్రేమ్ కుమార్…. స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ)తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. ప్రేమ లేదా పెళ్లి జంటలను విడగొట్టడం వీళ్ళ స్పెషాలిటీ. డబ్బులు బాగా వస్తుండటంతో హ్యాపీగా ఉంటారు. అటువంటి సమయంలో ప్రేమ్ కుమార్ దారికి నేత్ర అడ్డొస్తుంది. దానికి కారణం ఏమిటి? మధ్యలో అంగనా (రుచిత సాధినేని) ఎక్కడ్నుంచి వచ్చింది? చివరికి ప్రేమ్ కుమార్ కథ ఏ మలుపు తీసుకుంది? ఇదీ సింపుల్ గా ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు
ప్రేమ్ కుమార్ గా సంతోష్ శోభన్ బాగా చేశాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా, లవర్ బాయ్ గా అతడు బాగా సూట్ అయ్యాడు. అయితే పాత్రలో లోపాల వల్ల అతడు పెద్దగా ఆకట్టుకోడు. హీరోయిన్లు రాశి సింగ్, రుచిత సాధినేని ఓకే అనిపించుకున్నారు. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోడానికేం లేదు. ఒక్క పాట కూడా బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించదు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ పెద్దగా ఆకట్టుకోవు. ఎడిటింగ్ ఓకే కానీ ఇంకా ట్రిమ్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో పాటతో పాటు, ఓ 10 నిమిషాల సీన్లు కట్ చేయొచ్చు. దర్శకుడిగా అభిషేక్ మహర్షి తన వర్క్ తో ఆకట్టుకోలేకపోయాడు. అతడు ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ, దానిచుట్టూ సరైన సన్నివేశాలు అల్లుకోలేకపోయాడు, స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. దర్శకుడిగా అతడికిది సరైన డెబ్యూ కాదు.

న్యూస్ 360 తెలుగు ఎక్స్ క్లూజివ్ రివ్యూ
మంచి పాయింట్ అనుకోవడం ఒకెత్తు. ఆ పాయింట్ చుట్టూ మంచి సన్నివేశాలు రాసుకోవడం మరో ఎత్తు. ఫస్ట్ పాయింట్ లో ప్రేమ్ కుమార్ సక్సెస్ అయ్యాడు. మంచి పాయింట్ అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. కానీ ఈ పాయింట్ చుట్టూ మంచి సన్నివేశాలు, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కీలకమైన రెండో అంకంలో ఫెయిలయ్యాడు

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయిస్తారనేది నానుడి. ఈ సినిమాలో హీరో పెళ్లి కూడా అలానే ఫిక్స్ అవుతుంది. ఎన్ని సార్లు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా అది ఫెయిల్ అవుతుంది. దీంతో ఆ ఫెయిల్యూర్ నే తన సంపాదనకు మార్గంగా ఎంచుకుంటాడు హీరో. ఇలాంటి సెటప్ అంతా బాగానే పెట్టాడు దర్శకుడు. కానీ అసలైన పాత్రల చిత్రీకరణ (క్యారెక్టర్స్ ఆర్క్)లో చేతులు ఎత్తేశాడు.

కీలకమైన హీరో పాత్రలోనే క్లారిటీ మిస్సయింది. వరుసగా పెళ్లిళ్లు ఆగిపోవడంతో అతడు పెళ్లి చేసుకోవడం కోసం తాపత్రయపడుతున్నాడా లేక హీరోయిన్ కోసం ఆరాటపడుతున్నాడా అనే విషయం ప్రేక్షకుడికి అర్థంకాదు. దీంతో ప్రేక్షకుడు ఒక రకమైన గందరగోళానికి గురవుతాడు. ప్రధామార్థం మొత్తం పెళ్లిచూపులు, పెళ్లిళ్లు చుట్టూ తిప్పిన దర్శకుడు.. కామెడీ పేరిట కొన్ని డైలాగ్స్ పెట్టాడు. కానీ అవేవీ క్లిక్ అవ్వలేదు.

సెకెండాఫ్ లోనైనా సినిమా లేస్తుందనుకుంటే, అక్కడ కూడా తిరిగి ఫస్టాఫే రిపీట్ అయింది. అసలు హీరో దేనికోసం ప్రయత్నిస్తున్నాడనేది క్లూ-లెస్ గా మారింది. దీనికితోడు హీరోయిన్ పాత్ర కూడా అంతే కన్ఫ్యూజన్ గా ఉంది. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ కు అంగనా అనే పేరు ఎందుకు పెట్టారో తెలీదు కానీ, కంగాళీకి పర్యాయపదంగా ఉంది ఈ పాత్ర. ఆమెది ప్రేమనా లేక ఆకర్షణా లేక మోహమా అనేది బొత్తిగా అర్థం కాదు.

దీనికి తోడు విలన్ పాత్ర మరో ప్రహసనం. అసలు చైతన్య కృష్ణ పాత్ర కామెడీనా, విలనీనా అనేది చెప్పడం చాలా కష్టం. ఇలా ఏ పాత్రకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వకుండా, తనకు ఇష్టమొచ్చినట్టు రాసుకున్నాడు దర్శకుడు. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. ఎవ్వరికీ ఏమాత్రం అర్థంకానీ డైలాగ్స్ తో ప్రియదర్శితో డబ్బింగ్ చెప్పించి, ప్రోమో రిలీజ్ చేశారు. అప్పుడా ప్రోమో ఎందుకు రిలీజ్ చేశారో, ఈరోజు రిలీజైన సినిమా చూస్తే ఈజీగా అర్థమౌతుంది. ఏం చూస్తున్నామో, ఎందుకు చూస్తున్నామో, అసలు కథ ఎటు పోతోందో కూడా అర్థం కాని పరిస్థితి.

ఈ సినిమా షార్ట్ ఫిలింకు ఎక్కువ, సినిమాకు తక్కువగా ఉంది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరక్షన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.. ఇలా ఏ ఒక్క అంశంలో చెప్పుకోదగ్గ పాయింట్ లేదు. ఉన్నంతలో ఈ సినిమాను హీరో సంతోష్ శోభన్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అతడి కామెడీ టైమింగ్ బాగుంది కానీ సదరు కామెడీ సన్నివేశాల్లో పస లేకపోవడంతో.. అతడు కూడా చేతులెత్తేశాడు. మిగతా నటీనటులంతా తమ వంతు ప్రయత్నం చేశారు కానీ, క్యారెక్టరైజేషన్స్ లో డెప్త్ లేకపోవడం వల్ల ఏ ఒక్క పాత్ర కనెక్ట్ అవ్వదు.

ఓవరాల్ గా ప్రేమ్ కుమార్ సినిమా షార్ట్ ఫిలింకు ఎక్కువ, సినిమాకు తక్కువ అన్నట్టు ఉంది. కామెడీనే ప్రధాన ఆకర్షణగా వచ్చిన ఈ సినిమా, ఆ కామెడీని పండించడంలో పూర్తిగా విఫలమైంది.

– Written by Ravi Tungala

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400