వర్షం నుంచి కల్కి వరకు..

prabhas journey

ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్, రికార్డుల రారాజు. సినిమా చేస్తే వంద కోట్లు రావాల్సిందే. ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. వర్షం, బిల్లా, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో ఆలిండియా స్టార్ అయిపోయాడు. తాజాగా వచ్చిన ఆదిపురుష్ సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా అవతరించాడు. అయితే ప్రభాస్ అంటే కేవలం ఇది మాత్రమే కాదు. అతడి జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు కూడా ఉన్నాయి.

నిజానికి ప్రభాస్ మైండ్ లో హీరో అవ్వాలనే ఆలోచన లేదు. తన వయసువాళ్లంతా అప్పటికే హీరోలుగా మారినప్పటికీ.. ప్రభాస్ మాత్రం ఇతర వ్యాపారాలపై దృష్టిపెట్టాడు. తను మంచి భోజనప్రియుడు. కాబట్టి రెస్టారెంట్ బిజినెస్ పెడదామనుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు. ఆ తర్వాత ఆటోమొబైల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నాడు.

ఓసారి ప్రభాస్ ను అనుకోకుండా చూశాడు జయంత్. ప్రభాస్ లో తనకు ఓ హీరో కనిపిస్తున్నాడని, వీలైతే ఆయనతో సినిమా చేస్తానంటూ.. కృష్ణంరాజును కోరాడు. అప్పటికే కృష్ణంరాజు, ప్రభాస్ ను ఎన్నోసార్లు అడిగారు. సినిమాలు చేయమని కోరారు. కానీ ప్రభాస్ కు ఎప్పుడూ అటువైపు మనసుపోలేదు. ఏ ముహూర్తాన జయంత్ సి.పరాన్జీ అడిగాడో కానీ ప్రభాస్ వెంటనే ఓకే చేశాడు. అక్కడ్నుంచి కొత్త చరిత్ర మొదలైంది.

ప్రభాస్ కెరీర్ మొత్తం ఒకెత్తు. రాజమౌళితో అనుబంధం మరో ఎత్తు. ఛత్రపతి సినిమాతో రాజమౌళి-ప్రభాస్ అనుబంధం మొదలైంది. 2005లో వచ్చిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటికే ప్రభాస్ కు స్టార్ స్టేటస్ ఉంది. కానీ ఛత్రపతి సినిమా అతడి స్టార్ పవర్ ను ఊహించని విధంగా పెంచింది. తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు ఆల్ టైం హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్.

ఇక్కడ బాహుబలి ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా స్టార్ హీరోలకు ఒక్కో సినిమాకు ఏడాది టైమ్ కేటాయిస్తారు. కానీ బాహుబలిపై నమ్మకంతో, ప్రభాస్ ఏకంగా ఈ సినిమాకు ఐదున్నరేళ్లు కేటాయించాడు. టోటల్ కాల్షీట్లన్నీ ఈ సినిమాకే ఇచ్చాడు. బాహుబలి కోసమే డైట్ చేశాడు, బాహుబలి కోసమే తన జీవితంలో ఐదున్నరేళ్లను అంకితం చేశాడు. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ సినిమాకు ఏడేళ్లు కేటాయించడానికి తను మెంటల్లీ ప్రిపేర్ అయ్యానని, కానీ రాజమౌళి మాత్రం ఐదున్నరేళ్లలో ముగించాడని ప్రభాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

బాహుబలి కోసం ప్రభాస్ శ్రమించిన విధానం మిగతా హీరోలందరికీ మార్గదర్శనం. బాహుబలి కోసం ప్రభాస్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బాహుబలి పాత్ర కోసం 22 కిలోలు పెరిగిన ప్రభాస్.. అదే సినిమాలో శివుడి క్యారెక్టర్ కోసం అమాంతం బరువు తగ్గాడు. బాహుబలి – ది కంక్లూజన్ లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో కనిపించిన ప్రభాస్.. బాహుబలి క్యారెక్టర్ కోసం 105 కిలోల బరువు పెరిగాడు.

ప్రభాస్ పుస్తకప్రియుడు అనే విషయం చాలామందికి తెలియదు. కానీ ఫ్రీ టైమ్ లో టీవీ, సినిమాలు చూసేకంటే, పుస్తకాలు చదవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు ప్రభాస్. అతడి ఇంట్లో జిమ్ తో సమానంగా, లైబ్రరీకి ప్రాధాన్యం ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో వందలాది పుస్తకాలు, ప్రభాస్ లైబ్రరీలో ఉన్నాయి. ఆ లైబ్రరీని ప్రభాస్ స్వయంగా మెయింటైన్ చేస్తాడు. పుస్తకం పేరు చెబితే ఠక్కున వెళ్లి తీసుకొస్తాడు.

ప్రభాస్ కు ఆటలంటే కూడా చాలా ఇష్టం. జిమ్ లో చేసే వర్కవుట్స్ కంటే ప్లేగ్రౌండ్ లో ఆడే ఆటల్నే ఎక్కువగా ఇష్టపడతాడు. మీకో విషయం తెలుసా.. బాహుబలి సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ప్రభాస్ జిమ్ లో వర్కవుట్ కంటే గ్రౌండ్ లో వాలీబాల్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. వత్తిడిని దూరం చేయడానికి వాలీబాల్ కు మించిన సాధనం లేదంటాడు ఈ హీరో. అందుకే టైమ్ దొరికినప్పుడల్లా స్నేహితులతో సరదాగా వాలీబాల్ ఆడుతుంటాడు.

ఇక ఫిట్ నెస్ విషయానికొస్తే.. అందరి హీరోల్లా జిమ్ లో ఎక్కువగా గడపడానికి ప్రభాస్ ఇష్టపడదు. దేహధారుడ్యం కోసం కొండలు, గుట్టలు ఎక్కేస్తుంటాడు. ట్రెక్కింగ్ అంటే ప్రభాస్ కు మహా ఇష్టం. విదేశాలకు వెళ్లినప్పుడు ప్రభాస్ ఎక్కువగా ఇష్టపడేది ట్రెక్కింగ్ నే.

ఆర్భాటాలకు పోకుండా సాధారణంగా ఉండడం ప్రభాస్ కు అలవాటు. వివాదాలకు దూరంగా ఉండే అతికొద్దిమంది హీరోల్లో ఒకడు. ఎన్ని హిట్స్ వచ్చినా, ఎంత స్టార్ డమ్ పెరిగినా ఎలాంటి భేషజాలకు పోకుండా, అందరివాడులా ఉండడం ప్రభాస్ గొప్పదనం. ఇండస్ట్రీలో మొహమాటానికి కేరాఫ్ అడ్రస్ ఇతడు.

ప్రభాస్ కు సంబంధించి చాలామందిని ఎట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్ పెళ్లి. ఇప్పటివరకు ఈ హీరోకు దాదాపు 6వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా అన్ని ఆఫర్లను తిరస్కరించాడు ప్రభాస్. తాజాగా మరోసారి తన పెళ్లిపై ప్రకటన చేశాడు. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తనకే తెలియదని, ఒకవేళ పెళ్లంటూ చేసుకుంటే తిరుమలలోనే చేసుకుంటానని అన్నాడు.

ఓ సినిమాకు కమిట్ అయితే దానికి పూర్తిగా అంకితమైపోతాడు ప్రభాస్. బాహుబలి-1 రిలీజ్ తర్వాత 10 కోట్ల రూపాయల యాడ్ ఆఫర్ వస్తే తిరస్కరించాడు. దీంతోపాటు పలు బాలీవుడ్ ఆఫర్లను కూడా వద్దనుకున్నాడు. సినిమాపై ఫోకస్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెప్పాడు.

పక్షుల్ని పంజరంలో బంధించడానికి ప్రభాస్ పూర్తి వ్యతిరేకి. తన ఇంట్లో ఉన్న గార్డెన్ లో చాలా రకాల పక్షుల్ని స్వేచ్ఛగా పెంచుతున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోల్లో ప్రభాస్ రేంజ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హీరో మరొకరు లేరు.

కామిక్ కాన్ లో మెరిసిన తొలి టాలీవుడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ ను శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా విడుదల చేశారు. ఓ ఇండియన్ సినిమా గ్లింప్స్ ను కామిక్ కాన్ లో విడుదల చేయడం ఇదే తొలిసారి. ప్రభాస్ కెరీర్ లో ఇది కూడా ఓ రికార్డ్.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం