పవర్ స్టార్ పవన్ కల్యాణ్, వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడు ఎప్పుడు ఏ సినిమాకు కాల్షీట్లు ఇస్తాడనేది ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కల్యాణ్, ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే హరిహర వీరమల్లు షెడ్యూల్ లో జాయిన్ అవుతాడని అంతా అనుకున్నారు.
కానీ పవన్ మరోసారి తన మైండ్ మార్చుకున్నాడు. ఓజీ సినిమా షూటింగ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఓజీ సినిమా. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముంబయిలో మొదలైంది. పవన్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. ఆ షెడ్యూల్ ముగిసింది.
ఇప్పుడు సెకెండ్ షెడ్యూల్ ను వెంటనే స్టార్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కూడా పవన్ కొనసాగుతున్నాడు. సెకెండ్ షెడ్యూల్ పూణెలో ఆల్రెడీ మొదలైంది. ఈ షెడ్యూల్ కు 10 రోజులు కాల్షీట్లు కేటాయించాడు పవన్. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
ఈ షెడ్యూల్ తర్వాత పవన్, మరో సినిమాకు కాల్షీట్లు కేటాయిస్తాడా.. లేక తన రాజకీయ కార్యక్రమాలతో బిజీ అవుతాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవన్ కాల్షీట్లు ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ లేదా హరిహర వీరమల్లు సినిమాల్లో ఒకటి సెట్స్ పైకి వస్తుంది. వినోదాయ శితం రీమేక్ ప్రాజెక్టును ఇప్పటికే పూర్తిచేశాడు పవన్.