Ilayaraja Birthday – ఇళయరాజా బర్త్ డే స్పెషల్

సంగీత జ్ఞాని, మ్యాస్ట్రో, ఇసైజ్ఞాని, రాసయ్య.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా తక్కువే. ఎన్ని బిరుదులు తగిలించినా సరిపోవు. ఎంత పొడిగినా సమయం చాలదు, ఎంత రాసిన పేజీలు సరిపోవు. ఆయన ఓ చరిత్ర. సంగీతంలో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం కాదు, ఆయనే ఓ సంగీత సముద్రం. తరగని బాణీల గని అది. ఆయనే ఇళయరాజా. భారతీయ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.

1943, జూన్ 2న మధురై జిల్లా పన్నైపురంలో జన్మించిన ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. తన 30 సంవత్సరాల కెరీర్ లో వివిధ భాషల్లో దాదాపు 5వేలకు పైగా పాటలు కంపోజ్ చేశారు, వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా ఓ ప్రభంజనం.

తమిళ జానపదాల్ని ఒక తాటిపైకి తెచ్చిన సంగీత దర్శకుడు ఇళయరాజా. భారతీయ సంగీతానికి, వెస్ట్రన్ బీట్స్ జోడించి.. సరికొత్త సరిగమలు సృష్టించిన జ్ఞాని. ఆయన సృష్టించిన బాణీల్లో క్లాసిక్స్ ఉన్నాయి. ఇప్పటితరాన్ని కూడా ఉర్రూతలూగించే పాటలిచ్చారాయన. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నారు. అదీ ఆయన స్థాయి.

ఇళయరాజా నేపథ్య సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన వెస్ట్రన్ ఆర్కెస్ట్రాలోకి భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలను చొప్పించిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఇలాంటి ప్రయోగాలకు ఈయన హంగరీలో ప్రఖ్యాత “బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా”ని వాడేవారు. 1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి “సింఫనీ”ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేశారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఇళయరాజా.

2003లో బీబీసీ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి పాటల్ని తీసి, అందులోంచి టాప్-10 సాంగ్స్ ను ఎంపిక చేస్తే.. ఇళయరాజా పాటకు నాలుగో స్థానం దక్కింది. దళపతి సినిమాలో అరె చిలకమ్మా చిటికేయంగా అనే పాటకు.. టాప్-10లో నాలుగో స్థానం దక్కించుకుంది. ఇదే బీబీసీ.. 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49శాతం మంది ఇళయరాజాని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు.

చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీత జీవితాన్ని ప్రారంభించారు. అప్పుడప్పుడే మద్రాసులో మ్యూజిక్ రికార్డింగ్స్ మొదలవుతున్న టైమ్ అది. అంతకుముందు కోల్ కతాలో ఎక్కువగా రికార్డింగ్స్ జరిగేవి. పశ్చిమ బెంగాల్ కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు ప్లేయర్ గా పనిచేశారు ఇళయరాజా.

తరువాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. ఇందులో అత్యథికం కన్నడ సినిమాలే. పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు.

ఇక అక్కడ్నుంచి ఇళయరాజా ప్రభంజనం మొదలైంది. దక్షిణ భారత సంగీతంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు, మరెన్నో కొత్త పుంతలు కనిపించాయి. ఇళయరాజా రాకతో సంగీత దర్శకులకు స్వేచ్ఛ పెరిగింది. కొత్త వాయిద్యాల రాక మొదలైంది. ఫ్యూజన్ కాన్సెప్ట్ కూడా ఇళయరాజాతోనే ఎక్కువగా పాపులర్ అయింది.

సన్నివేశం ఇలా చెప్పిన వెంటనే, అలా తన దగ్గరున్న సహాయకుల్ని సిద్ధం చేసేవారు ఇళయరాజా. అక్కడికక్కడే బాణీలు కంపోజ్ చేసేవారు. అది పాట అయినా, నేపథ్య సంగీతం అయినా ఆయన స్టయిల్ ఇదే. మనసులో వెంటనే స్ఫురించిన రాగం, బాణీగా మారిపోతుంది. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అంటారు చాలామంది. ఇప్పటికీ ఆయన స్టయిల్ ఇదే. దశాబ్దాలు గడిచినా ఇంకా పాటలు కంపోజ్ చేస్తూనే ఉన్నారు ఈ జ్ఞాని,

భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు ఇళయరాజా. 2015లో గోవాలో జరిగిన 46వ “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా”లో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ విభాగంలో సెంటినరీ అవార్డు దక్కించుకున్నారు. 2018లో భారత ప్రభుత్వం ఈయనను “పద్మవిభూషణ్” పురస్కారంతో సత్కరించింది. భారతీయ సినిమా మనుగడలో ఉన్నంతకాలం ఇళయరాజా సంగీతం ఉంటుంది. తరాలు మారినా ఆయన మాటలు అలరిస్తూనే ఉంటాయి.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400