టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై వరుసగా రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ కంపెనీపై అధికారులకు కొన్ని అనుమానాలున్నాయి. ఈ సంస్థపై బయట కొన్ని ఆరోపణలు, ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర-రాష్ట్ర జీఎస్టీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై దాడులు చేశాయి. ఈ సోదాలు వరుసగా ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని ఆఫీసుతో పాటు.. నవీన్, రవిశంకర్ ఇళ్లల్లో కూడా సోదాలు నడుస్తున్నాయి.
టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది మైత్రీ మూవీ మేకర్స్. ముందుగా ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ ప్రొడక్షన్ కంపెనీ పెట్టారు. అందుకే దీనికి మైత్రీ అనే పేరు కూడా పెట్టారు. రావడమే, బడా హీరోలకు అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు తీయడమే కాకుండా.. వరుసగా విజయాలు కూడా అందుకున్నారు.
దాదాపు 8 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్న ఈ నిర్మాణ సంస్థలో అంతర్గతంగా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఇద్దరు నిర్మాతలు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం మైత్రీకి నవీన్, రవిశంకర్ మాత్రమే నిర్మాతలుగా కొనసాగుతున్నారు. అదే టైమ్ లో తమ వ్యూహాలు కూడా మార్చారు.
పూర్తిగా పెద్ద సినిమాలకే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా విజయాలు అందుకున్నారు. మొన్నటికిమొన్న సంక్రాంతికి విడుదలైన 2 పెద్ద సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ వే. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో సక్సెస్ అయ్యాయి
ఇలా సూపర్ హిట్ బ్యానర్ గా కొనసాగుతున్న మైత్రీ ఆఫీస్ పై రాష్ట్ర, కేంద్ర జీఎస్టీ అధికారులు కన్నేశారు. వరుసగా రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ఆఫీస్ తో పాటు నిర్మాతల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు.