కంటెంట్ ఎక్కువగా ఉంటే 2 భాగాలుగా చేయొచ్చు. బాహుబలి, కేజీఎఫ్ ఫ్రాంచైజీలను ఇలానే చేశారు. కానీ పవన్ సినిమాను 2 భాగాలుగా చేయాలనే ఆలోచన కంటెంట్ ఎక్కువై రాలేదు. దీనికి సెపరేట్ రీజన్ ఉంది. పవన్-క్రిష్ కాంబోలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. దాదాపు మూడేళ్లుగా నలుగుతోంది ఈ ప్రాజెక్టు.
ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ 2 చిత్రాలను పూర్తి చేసి విడుదల చేశాడు. అవే వకీల్ సాబ్, భీమ్లా నాయక్. ఇవి కాకుండా మరో 3 సినిమాలు స్టార్ట్ చేశాడు. వీటిలో వినోదాయ శితం రీమేక్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో రెండు శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయి. దీనికి భిన్నంగా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ నీరసంగా సాగుతోంది. స్క్రిప్టులో చెప్పుకోదగ్గ మార్పులు చేశారనీ, పాటలు, ఫైట్స్ సంఖ్య తగ్గించారని ప్రచారం జరిగింది.
దీంతో ఈ ప్రాజెక్టుపై పవన్ కళ్యాణ్ కు ఇంట్రెస్ట్ పోయిందనే ప్రచారం మొదలైంది. షూటింగ్ ఆలస్యమవ్వడానికి ఇదే కారణమని తెలుస్తోంది. అయితే ఇంట్రెస్ట్ లేకపోయినా సినిమాను పూర్తిచేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. దీంతో ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా చేయడం ఖాయం. అయితే దీనికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.
అదే జరిగితే దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం పరిస్థితి దారుణంగా మారుతుంది. అందుకే క్రిష్ ఓ ఆలోచన చేశాడు. హరిహర వీరమల్లు సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. మరో 2 వారాలు షూట్ చేస్తే, పార్ట్-1కు సరిపోయేంత కంటెంట్ వస్తుందంట. అది రిలీజ్ చేస్తే, పార్ట్-2 సంగతి అప్పుడు చూసుకోవచ్చని భావిస్తున్నాడు. ఐడియా బాగానే ఉంది కానీ, ఈ ప్రతిపాదనకు పవన్ కూడా అంగీకరించాలి. పవన్ ఓకే అంటే హరిహర వీరమల్లు పార్ట్-1 థియేటర్లలోకి వస్తుంది.