మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై రోజుకో పుకారు పుట్టుకొస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ప్రచారం ఊపందుకుంది. ఈమధ్య ఓ మాల్ లో ఈ సినిమా కోసం హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల మధ్య కొన్ని సన్నివేశాలు తీశారు. షెడ్యూల్ కూడా పూర్తయింది.
అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆ సన్నివేశాలు త్రివిక్రమ్ కు నచ్చలేదంట. వాటిని తొలిగిస్తున్నట్టు మహేష్ కు చెప్పాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదటికొచ్చినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి.
వీటిపై పరోక్షంగా స్పందించాడు దర్శకుడు నాగవంశీ. తమ సినిమాపై వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దంటున్నాడు. మరోవైపు మూవీకి సంబంధించి రెండు క్రేజీ అప్ డేట్స్ ఇచ్చాడు. వీటిలో ఒకటి మహేష్-త్రివిక్రమ్ మూవీ టీజర్ రిలీజ్ డేట్. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
ఇక మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ప్రకటించాడు. తాజా ప్రకటనలతో ఈ సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. మహేష్-త్రివిక్రమ్ ది క్రేజీ కాంబినేషన్. ముందుగా వీళ్లిద్దరూ కలిసి అతడు సినిమా చేశారు. అదొక క్లాసిక్ గా నిలిచింది.
రెండో ప్రయత్నంగా ఖలేజా చేశారు. అది ఫ్లాప్ అయినప్పటికీ, చాలామంది ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మూడో చిత్రం కోసం కలిసింది ఈ జోడీ. ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.