ఏ ముహూర్తాన అహింస సినిమాను మొదలుపెట్టారో కానీ, ఆ మూవీ ఇప్పటికీ ప్రేక్షకులముందుకు రాలేకపోయింది. ఇంకా చెప్పాలంటే దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ కోసం ఎంత వెయిట్ చేశాడో, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి అంతకంటే ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది. దాదాపు 7 నెలల కిందటే ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. కొంతమందికి సినిమా చూపించారు కూడా. కొంతమంది మెచ్చుకున్నారు, మరికొంతమంది బాగాలేదన్నారు. అలా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేస్తూ వస్తున్నారు.
అయితే ఓవైపు ఇంత జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఈ సినిమాకు మార్కెట్ జరగలేదు. అహింసను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా మార్కెట్ విషయంలో తేజ బ్రాండ్ ఇమేజ్ కూడా కలిసిరావడం లేదు. ఎఁదుకంటే, ఈమధ్య కాలంలో ఆయన కూడా సరైన కమర్షియల్ హిట్ ఇవ్వలేదు. హిట్ ఇవ్వలేని దర్శకుడు, కొత్త హీరో కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో బయ్యర్లు అహింసను లైట్ తీసుకున్నారు.
నిజానికి ఈ సినిమాను రిలీజ్ చేయాలంటే చిటికెలో పని. కొడుకు సినిమాపై సురేష్ బాబు ఇలా మనసుపెడితే చాలు, అలా రిలీజ్ అయిపోతుంది మూవీ. కానీ సురేష్ బాబు పక్కా బిజినెస్ మేన్. రూపాయి పెడితే రూపాయి లాభం రాకపోయినా పర్వాలేదు కానీ పెట్టిన రూపాయి పోకూడదనేది ఆయన సిద్ధాంతం. డబ్బు విషయంలో అంత పక్కాగా ఉండే సురేష్ బాబు, చిన్నకొడుకు అభిరామ్ మూవీపై డబ్బులు పెట్టడానికి ఇష్టపడడం లేదనేది ఇంటర్నల్ టాక్.
జెమినీ కిరణ్ నిర్మించిన ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యతను సురేష్ బాబు తీసుకుంటే, క్షణాల్లో మూవీ రిలీజ్ అయిపోతుంది. పోనీ అలా చేద్దామన్నా కూడా, ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా జరగలేదు. కనీసం అది జరిగినా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయి.
దీంతో అహింస సినిమా రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఈనెలలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను తాజాగా వచ్చే నెలకు వాయిదా వేశారు. మరోవైపు ఈ సినిమా సాంగ్స్ మాత్రం బాగా క్లిక్ అయ్యాయి. ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడు.