నటీనటులు: నాగచైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్స్: అబ్బూరి రవి
రన్ టైమ్: 2 గంటల 28 నిమిషాలు
రిలీజ్ డేట్: మే 12, 2023
రేటింగ్: 2.75/5
నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీపై చైతన్య భారీ హోప్స్ పెట్టుకున్నాడు. సెటప్ కూడా బాగానే కుదిరింది. అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పుట్ మాత్రం బయటకురాలేదు. నాగచైతన్య చెప్పినట్టు సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది కస్టడీ మూవీ.
సినిమాలో శివ (నాగచైతన్య) ఓ కానిస్టేబుల్. నిజాయితీకి మారుపేరు. న్యాయం వైపు నిలబడే రకం. రేవతి (కృతి శెట్టి)ని చిన్నప్పట్నుంచి ప్రేమిస్తుంటాడు. ఓవైపు అతడి లవ్ ప్రాబ్లమ్ నడుస్తుంటుంది, మరోవైపు శివ పోలీస్ స్టేషన్ లోకి హఠాత్తుగా క్రిమినల్ రాజు (అరవింద్ స్వామి) వస్తాడు. అతడ్ని తరుముకుంటూ సీబీఐ వాళ్లు కూడా వస్తారు. తెల్లారేలోపు రాజును బెంగళూరులోని కోర్టులో హాజరుపరచాలి. ఆ బాధ్యతను శివ తీసుకుంటాడు. మరోవైపు రేవతికి వేరే పెళ్లి చేయాలనుకుంటారు. దీంతో రాజుతో పాటు, రేవతిని కూడా తనతో తీసుకెళ్తాడు శివ. అసలు రాజు కేసుపై శివకు ఎందుకు అంత ఆసక్తి? శివ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చివరికి రాజును కోర్టులో హాజరుపరిచాడా లేదా? ఈ కేసుకు ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి)కి సంబంధం ఏంటి? అనేది బ్యాలెన్స్ స్టోరీ.
ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడానికి మెయిన్ రీజన్ ఒకటుంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో, తండ్రిని చంపిన విలన్ ను హీరో నరికిపారేస్తాడు. మెయిన్ విలన్ ను కసితీరా చంపుతాడు. కానీ ఇందులో హీరో అలా చేయడు. అతడికి కోపం ఉంటుంది. కానీ ఆ కోపాన్ని న్యాయాన్ని గెలిపించడం కోసం వాడతాడు. అందుకే కళ్లముందు తండ్రి చనిపోయినా, చంపినవాడ్ని వదిలేసి పారిపోతాడు. అన్నను చంపిన వ్యక్తిని చివరివరకు కాపాడుతూ వస్తుంటాడు. ఈ పాయింట్ కాస్త కొత్తగా అనిపించినప్పటికీ, థియేటర్లలో ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వలేకపోయింది.
సగటు టాలీవుడ్ ప్రేక్షకుడు ప్రతీకారం కోరుకుంటాడు. విలన్ ను హీరో చంపితేనే ఆడియన్స్ కు తృప్తి. అందుకే మేకర్స్ ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి, లాజిక్ లేకపోయినా సన్నివేశాలు తీస్తారు, ప్రేక్షకులు అలాంటి వాటికే కనెక్ట్ అవుతారు. కానీ కస్టడీ మూవీలో అంతా లాజిక్ ప్రకారం జరుగుతుంది. అదే సమయంలో మరికొన్ని చోట్ల ఆ లాజిక్ కనిపించదు.
కస్టడీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరిచే కానిస్టేబుల్ గా శివ కనిపిస్తాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతడు అదే పనిలో ఉంటాడు. సినిమాను కాస్త స్లోగా స్టార్ట్ చేస్తాడు దర్శకుడు, ఫస్టాఫ్ లో హీరోహీరోయిన్ల ప్రేమ, పాటలకు చోటిచ్చాడు. ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ కార్డ్ అద్భుతంగా వేస్తాడు దర్శకుడు. సెకెండాఫ్ నుంచి పూర్తిగా లైన్ పైనే నిలబడ్డాడు దర్శకుడు. రాజు, శివ, రేవతి ల థ్రిల్లింగ్ జర్నీని చూపించాడు. ఈ క్రమంలో క్లయిమాక్స్ లో దర్శకుడు ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చినప్పటికీ, అది ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించదు. ఆ ట్విస్ట్ బదులు ఓ మంచి యాక్షన్ ఎపిసోడ్ పెట్టి ఎండ్ కార్డ్ వేసుంటే బాగుండేది.
ఇలాంటి సినిమాల్లో హీరో చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు, ఇది రొటీన్ ఫార్మాట్ అయినప్పటికీ, హీరో చేత్తో న్యాయం చేస్తే ఆడియన్స్ కు కిక్ ఉంటుంది. సినిమాలో శివకు కూడా కేసుతో పర్సనల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి హీరోనే న్యాయం చేయడం కరెక్ట్ అని ఆడియన్స్ భావిస్తారు. కానీ హీరో మాత్రం క్లయిమాక్స్ లో సగటు కానిస్టేబుల్ లానే వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో దర్శకుడు వెంకట్ ప్రభు మంచి థ్రిల్స్ ఇచ్చినప్పటికీ.. స్క్రీన్ ప్లే పరంగా, ఇలాంటి హై-మూమెంట్స్ పరంగా ఆకట్టుకోలేకపోయాడు.
ఇదే సినిమాలో అజిత్ లాంటి స్టార్ ఉంటే రేంజ్ మరోలా ఉండేదేమో, వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే ఇంకోలా రాసుకొని ఉండేవాడేమో. అయితే ప్రేక్షకుడు మాత్రం అక్కడ అజిత్ ఉన్నా నాగచైతన్య ఉన్నా ఒకేలాంటి హై కోరుకుంటారనే విషయాన్ని దర్శకుడు మిస్సయ్యాడు. నాగచైతన్య మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కానిస్టేబుల్ శివగా అతడి యాక్టింగ్, మేనరిజమ్స్ బాగున్నాయి. హీరోయిన్ కృతిశెట్టికి కూడా మంచి రోల్ దక్కింది. ఇక అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో మెప్పించారు. ఇంత సీనియస్ మూవీలో కూడా అక్కడక్కడ మంచి ఫన్ జనరేట్ అయింది. వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడు.
టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. ఇళయరాజా-యువన్ శంకర్ రాజా ద్వయం పాటలతో ఆకట్టుకోలేకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మేజిక్ చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. అండర్ వాటర్ సీన్లు బాగా పిక్చరైజ్ చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా కస్టడీ సినిమాలో మేకర్స్ చెప్పిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం, లాజిక్ లేకుండా ఉన్న కొన్ని సన్నివేశాలు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపిస్తాయి.